ఇండియా కూటమికి కేజ్రీవాల్ మార్క్ షాక్...?

ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కాబోయే ప్రధాని ఎవరు అన్న దాని మీద చేసిన సంచలన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

Update: 2023-08-30 13:00 GMT

ఇండియా పేరుతో విపక్షాలు కూటమి కట్టిన సంగతి విధితమే. ఈ కూటమి రేపటి రోజున దేశంలో బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ కూటమిలో దిగ్గజ నేతలు, కీలక పార్టీలు అన్నీ కలిపి చాలానే ఉన్నాయి. ఈ కూటమిలో దాదాపుగా అరడజను మందికి పైగా ప్రధాని రేసులో ఉన్న వారే కావడం విశేషం. ఇదే కూటమికి మైనస్ అవుతుందని ముందు నుంచి అంతా అనుకుంటున్నదే. ఇదిలా ఉంటే ముచ్చటగా మూడవ కూటమి మీటింగ్ ని ముంబైలో ఈ నెల 31న నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పాట్నా, బెంగళూరులలో మీటింగ్స్ జరిగాయి. అయితే ఏ మీటింగులోనూ ప్రధాని అభ్యర్ధి ఎవరు అన్నది చర్చకు రాలేదు. కానీ ముంబై మీటింగ్ కి మాత్రం ప్రధాని అభ్యర్ధులు వరసబెట్టి బయటకు వస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, ఇండియా కూటమి చాయిస్ అతనే అంటూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ మధ్యనే ప్రకటన ఇచ్చారు.

ఆ విషయం అలా ఉండగానే ఇరవై నాలుగు గంటలలో మీటింగ్ ఉంటుందని అనుకుంటున్న వేళ ఆప్ ఒక బాంబు లాంటి వార్త పేల్చింది. ఈ దేశానికి తదుపరి ప్రధాని కేజ్రీవాల్ అవాలని తాము కోరుకుంటున్నట్లుగా ఆప్ ప్రకటించడం నిజంగా ఇండియా కూటమికి ప్రధాని పదవికి రేసులో ఉన్న వారికి కూడా షాక్ లాంటి పరిణామమే అంటున్నారు.

ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కాబోయే ప్రధాని ఎవరు అన్న దాని మీద చేసిన సంచలన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ ని ప్రధాని అభ్యర్థిగా తాము చూడాలని అనుకుంటున్నట్లుగా ఆమె ప్రకటించేశారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందని ఆమె అంటున్నారు. ఢిల్లీలో ఎన్నో పధకాలు తాము ఉచితంగా అమలు చేస్తున్నమని అయినా తమది మిగులు బడ్జెట్ అని ఆమె గట్టిగా చెప్పుకున్నారు. ఢిల్లీలో ప్రజలౌ ఉచిత నీరు, ఉచిత విద్య, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర అందిస్తున్నామని ఆమె వివరించారు. అయినప్పటికీ మేం మిగులు బడ్జెట్‌ను చూపిస్తున్నామని చెప్పడం విశేషం.

దేశంలో ద్రవ్యోల్బణం గురించి ఆలోచించినా కూడా అందరి కంటే తక్కువగా ఢిల్లీలో ఉందని అన్నారు. తాము అలా ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంచగలిగామంటే అది కేజ్రీవాల్ పాలనా దక్షత అని ఆమె చెప్పారు. కేజ్రీవాల్ ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశం మొత్తం న్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతుందని ఆమె అంటున్నారు. అదే టైం లో లైసెన్స్ రాజ్ వ్యవస్థ పూర్తిగా పోతుందని అన్నారు. ఇక మౌలిక వనరుల కల్పనతో పాటు, వ్యవసాయానికి ఆప్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

అందువల్ల కేజ్రీవాల్ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని ఆమె అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో చూస్తే సీనియర్ మోస్ట్ లీడర్ శరద్ పవార్ నుంచి మొదలెడితే బీహార్ సీఎం నితీష్ కుమారు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆరోగ్యం సహకరిస్తే లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు ప్రధాని కావాలని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రెడీ అని ఆ పార్టీ వారు చెబుతున్నారు. ఈ మధ్యలో ఆప్ నుంచి కేజ్రీవాల్ పోటీకి దిగిపోయి అందరికీ షాక్ కొట్టించేశారు. అసలే కాంగ్రెస్ ఆప్ ల మధ్య ఢిల్లీలో లడాయి సాగుతోంది. ఇపుడు ప్రధాని రేసులో చూస్తే రాహుల్ అని వారు అంటే కేజ్రీ వాల్ అని ఆప్ నేతలు అంటున్నారు.

మరి సిద్ధాంతాల పరంగా ఇండియా కూటమి బీజేపీకి ఎలా ఆల్టర్నేషన్ అవుతుందో చూడాల్సి ఉంది. అలాగే అంతా ఏక మాట మీద ప్రధాని అభ్యర్ధి వీరు అని ఎన్నుకుంటే ఎన్నికలకు వెళ్లే ముందు అదే అతి పెద్ద విజయం అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News