ఆ విషయంలో మోడీకి ఒవైసీ మద్దతు కన్ఫాం అంట!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మోడీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ!

Update: 2024-05-23 05:10 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాలతో, ప్రజలకు ఏమి కావాలో ఆ విషయాలపై హామీలు ఇస్తూ కొంతమంది ముందుకు సాగుతుంటే... భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి మరికొంతమంది చూస్తూ ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మోడీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ!

అవును... నిత్యం ఉప్పూ నిప్పు గా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ - అసదుద్ధీన్ ఒవైసీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పరోక్షంగా ముస్లింలపై మోడీ సెటైర్లు పేలుస్తుంటే... ఈ వ్యవహారంపై మోడీకి నేరుగా సవాళ్లు విసురుతుంటారు ఒవైసీ. అలాంటి పరిస్థితుల్లో... ఒక్క విషయంలో మాత్రం నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెబుతున్నారు ఒవైసీ. అదే... పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారం!

ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఆక్రమిత క‌శ్మీర్‌ ను తిరిగి తీసుకుంటామంటూ నరేంద్ర మోడీ గ‌త కొన్నాళ్లుగా ప్రక‌టిస్తున్న వ్యవ‌హారంపై అస‌దుద్దీన్ ఆస‌క్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాము కూడా మ‌ద్దతిస్తామ‌ని, తాము కోరుకుంటున్నది కూడా ఇదేన‌ని తేల్చి చెప్పారు. పీవోకే.. భార‌త్‌ లో అంత‌ర్భాగ‌మ‌ని తాము మొదటినుంచీ చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు.

అయితే... పీవోకే పై తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని.. ఇప్పటికైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వెనక్కి తీసుకుంటామని మోడీ గట్టిగా నిలబడితే తమ మద్దతు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీవోకే అనేది భారత్ లో అంతర్భాగమే అని తెలిపిన ఒవైసీ... వారు ఎన్నికల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా అనేది మాత్రం తమ అతిపెద్ద సందేహం అని నొక్కి చెప్పారు. .

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ లో మీడియాతో మాట్లాడిన ఒవైసీ... పీవోకే వ్యవ‌హారాన్ని సీరియ‌స్‌ గా తీసుకోవాల‌ని సూచించారు. కానీ, అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల భావోద్వేగాలతో ఈ ప్రక్రియను ముడిపెడుతున్నారని.. కేవ‌లం ఎన్నిక‌ల కోసమే ప్రజ‌ల‌ను రెచ్చగొట్టేందుకు మోడీ, బీజేపీ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నార‌ని మండిపడ్డారు.

ఇక.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై స్పందించిన ఒవైసీ.. ఆ విషయం వారే చెప్పాలని ఎద్దేవా చేశారు! బీజేపీ నేతలు ప్రతీ విషయంలోనూ దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని.. 400 సీట్లు వస్తాయని చెబుతున్నారని.. ఎలా వస్తాయో చెప్పమంటే మాత్రం సమాధానం లేదని అన్నారు. ఈసారి యూపీలోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News