అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 17 ఎంపీ స్థానాల్లో ఎవరికి ఎంత?
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాల వేళ సాధించిన స్థానాల్ని చూసినప్పుడు రెండో స్థానంలో బీఆర్ఎస్.. మూడో స్థానంలో బీజేపీ.. నాలుగో స్థానంలో మజ్లిస్ పార్టీలు నిలవటం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోల్చి చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 9 సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్.. ఒక స్థానంలో మజ్లిస్ అత్యధిక ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అదిలాబాద్ లోక్ సభ స్థానంలో గరిష్ఠంగా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించినా.. అత్యధిక ఓట్ల సాధనలో మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో రెండు స్థానాల్నిగెలుచుకున్న బీఆర్ఎస్ కు అధిక ఓట్లు రావటం గమనార్హం.
కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో అత్యధికంగా నాలుగు సీట్లను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఓట్ల సాధనలో మాత్రం రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ కంటే ఒక స్థానం తక్కువతో అంటే మూడు స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అధిక ఓట్లను సాధించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 6 సీట్లు గెలుచుకున్న మజ్లిస్ పార్టీ మొదటిస్థానంలో నిలవగా.. ఒకస్థానం సొంతం చేసుకున్న బీజేపీ అత్యధిక ఓట్లను సాధించిన విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
పెద్దపల్లి.. మహబూబ్నగర్.. ఖమ్మం మూడు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో ఏడేసి అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో మాత్రం ఆరు స్థానాల్ని గెలుచుకుంది. ఆసక్తికరంగా ఈ రెండు ఎంపీ స్థానాల పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకపోవటం గమనార్హం. నల్గొండ.. భువనగిరి.. వరంగల్.. మహూబాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ వరుసగా.. ఆరేసి స్థానాల్ని సొంతం చేసుకోగా.. ఈ నాలుగు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్కో స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. జహీరాబాద్.. నాగర్ కర్నూలు రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు.. ఐదు అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోగా.. బీఆర్ఎస్ రెండేసి స్థానాలకే పరిమితమైంది.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ అత్యధికస్థానాల్ని గెలుచుకున్న లోక్ సభ నియోజకవర్గాల్నిచూస్తే.. మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తాజా ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. ఈ ఎంపీస్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలు కాగా.. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.
కిషన్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గెలుచుకోలేదు. మొత్తం స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మెదక్ ఎంపీ స్థానానికి చూస్తే.. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. బీఆర్ఎస్ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది.
కరీంనగర్.. నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడు చొప్పున అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ మాత్రం నాలుగు.. రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందులో నిజామాబాద్ పరిధిలో మాత్రం బీజేపీ రెండు స్థానాల్ని సొంతం చేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికరమైన ఎంపీ స్థానం అదిలాబాద్ గా చెప్పాలి. ఇక్కడ ఓట్లలో అత్యధిక ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి.
గులాబీ పార్టీకి ఈ ఎంపీ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 4.64 లక్షల ఓట్లు రాగా.. సొంతం చేసుకున్న అసెంబ్లీ స్థానాలు మాత్రం రెండు మాత్రమే. అదే సమయంలో బీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు 4.47 లక్షలు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం నాలుగు స్థానాల్లో గెలవగా.. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లతో పోలిస్తే దాదాపు రెండు లక్షల ఓట్లు తేడా వచ్చిన కాంగ్రెస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది.
మజ్లిస్ అధిక్యతను ప్రదర్శించిన హైదరాబాద్ ఎంపీ స్థానం విషయంలో మజ్లిస్ ఆరుస్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ ఒకస్థానంలో విజయం సాధించింది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఒక అసెంబ్లీ స్థానాన్ని మజ్లిస్ గెలవగా.. ఖమ్మం ఎంపీ స్థానంలో ఒక స్థానాన్ని సీపీఐ విజయం సాధించింది.