ఆ ఓటు ఎటూ పోదు.. వైసీపీ లెక్కలు తెలుసా..?
ఆ ఓటు ఎటూ పోదు.. కానీ, మనం ఒడిసి పట్టడంలోనే ఉంటుంది లెక్కంతా! ఇదీ.. తాజాగా కీలక సలహాదారు.. పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన మాట
ఆ ఓటు ఎటూ పోదు.. కానీ, మనం ఒడిసి పట్టడంలోనే ఉంటుంది లెక్కంతా! ఇదీ.. తాజాగా కీలక సలహాదారు.. పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన మాట. ఆ ఓటే.. ఆరోగ్య శ్రీ, ఆ ఓటే అమ్మ ఒడి, ఆ ఓటే ఇంటింటికీ పింఛన్.. ఈ మూడే వైసీపీకి బలం.. బలగంగా మారనున్నాయని.. మారుతున్నాయని వైసీపీ అంచనా వేయడమే కాదు. ఒక్క పక్కా లెక్కకు కూడా వచ్చేసింది. రాష్ట్రంలో గతానికి భిన్నంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. దీనిలో సంచలనమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ డాక్టర్ కాన్సెప్టు దీనిలో భాగమే. ఇక, తాజాగా ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకున్నవారికి ఇంటికే మందులు పంపిస్తున్నారు.
ఇక, అక్కడితో కూడా ఆగలేదు. ఏకంగా 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ప్యాకేజీ పెంచారు. దీంతో ఎక్కడచూసినా.. ఏ ఆసుపత్రిలో విన్నా.. ఆరోగ్య శ్రీ నామస్మరణే వినిపిస్తోంది. ఆరోగ్య శ్రీ కిందే దాదాపు 98 శాతం మంది రోగులు వైద్యం పొందుతున్నారు. ఇదేదో వైసీపీ నాయకులు, లేదా.. వైసీపీ ప్రభుత్వం చెప్పిన లెక్కకాదు. సాక్షాత్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. తాజాగా వెల్లడించిన గణాంకం. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్(కేంద్రపథకం) ను మించి ఆరోగ్య శ్రీ అమలవుతోందని కేంద్రమే పార్లమెంటులో పేర్కొంది. ఇది తమకు ఓటు బ్యాంకుగా మారుతుందనేది వైసీపీ గట్టి విశ్వాసం.
ఇక, అమ్మ ఒడి. ఇదొక బృహత్తర పథకం. ప్రతి అమ్మకూ.. కొడుకు, కూతురు ఎవరున్నా.. రూ.15 వేల చొప్పున(దీనిలో రెండు వేలు మెయింటెనెన్స్‌కు ఇస్తున్నారు.) ప్రతి ఏటా అందించారు. ఇప్పటికి నాలుగు సార్లు ఇచ్చారు. మరో విడత ఇవ్వాల్సి ఉంది. దీనిని వచ్చే ఫిబ్రవరి తొలి వారంలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఆపడానికి వీల్లేని పథకం కూడా.ఎన్నికల కోడ్ ఉన్నా.. అప్పటికే నాలుగేళ్లుగా అమలవుతున్నందున ఇది కొనసాగనుంది. దీంతో ఈ పథకం కూడాతమకు ఓటు బ్యాంకును మోసుకొస్తందని వైసీపీ నమ్మకం.
ఇక, మరో అత్యంత కీలకమైన పథకం ఇంటింటికీ రేషన్, ఇంటింటికీ పింఛను, ప్రతి నెలా.. 1వ తేదీనే సూర్యుడు కూడా ఉదయించక ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం మందికి సామాజిక పింఛను వారి ఇళ్లకే తలుపు తట్టి మరీ ప్రభుత్వం ఇస్తోంది. ఇది వృద్ధులు, దివ్యాంగులకు, మహిళలకు వరంగా మారింది. ఇక, ఇంటికే రేషన్ కూడా అదే ఫలితాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలు కూడా.. తమకు ఓటు బ్యాంకును తెస్తాయనేది వైసీపీ విశ్వసిస్తున్నమాట. అయితే.. ఈ ఓటు బ్యాంకును బెసక కుండా.. ఒడిసి పట్టడంలోనే నేర్పు ఉండాలని.. పార్టీ సూచిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.