అసెంబ్లీ వీడియోలపై స్పీకర్ సీరియస్.. చర్చలకు సిద్ధం

కారణం.. స్పీకర్ చాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న వీడియోలు బయటకు రావటం.. సోషల్ మీడియాలో పోస్టు కావటంపై స్పీకర్ సీరియస్ అయ్యారు.

Update: 2024-08-01 10:50 GMT

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలకు పిలుపునివ్వటం.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయటం తెలిసిందే. ముందుగా అనుకున్న దాని ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దగ్థం కార్యక్రమాన్ని చేపట్టారు.

అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేపట్టారు. ఒకదశలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట కూడా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మార్షల్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చిన వారిని బస్సులో స్టేషన్ కు తరలించారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ గులాబీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. ఈ ఎపిసోడ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కారణం.. స్పీకర్ చాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న వీడియోలు బయటకు రావటం.. సోషల్ మీడియాలో పోస్టు కావటంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్దంగా ఇలా బయటకు తెస్తారన్నది ప్రశ్నగా మారింది. కారణం.. అసెంబ్లీ ప్రాంగణం మొత్తం ఫోటోలు.. వీడియోలు తీయాలన్నా.. తీసిన వాటిని బయటకు పంపాలన్నా.. ప్రసారం చేయాలన్నా స్పీకర్ అనుమతి ఉండాల్సిందే.

కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళన వేళ.. ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీసి.. మీడియాకు లీకు చేయటంపై స్పీకర్ సీరియస్ గా ఉన్నారు.

ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీసీ కెమేరా ఫుటేజ్ లను పరిశీలించి.. ఫోన్ రికార్డు చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News