హసీనా ఎపిసోడ్ తో తెర పైకి ఆగస్టు సెంటిమెంట్
ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బోలెడన్ని విశ్లేషణలు రావటం తెలిసిందే.
ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బోలెడన్ని విశ్లేషణలు రావటం తెలిసిందే. తాజా చర్చకు వచ్చిన అంశం పలువురిని ఆకర్షిస్తోంది. గుడ్డిగా కాకుండా.. తాను చెప్పే అంశాలకు గతాన్ని.. గతంలోచోటు చేసుకున్న పరిణామాల్ని చూపిస్తూ చెబుతున్న అంశాల్ని చూసినప్పుడు.. నిజమే కదా? అన్న భావన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పే ముజిబుర్ రెహ్మాన్ (షేక్ హసీనా తండ్రి) కుటుంబానికి ఆగస్టు నెల ఎప్పుడూ క్రూరమైనదేనని చెబుతారు. ఆగస్టు సంక్షోభం ఆ కుటుంబాన్ని వెంటాడి వేధిస్తూ ఉంటుందని.. తాజా పరిణామాలు సైతం ఆగస్టులోనే చోటు చేసుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపక నిర్మాత షేక్ ముజిబుర్ రెహ్మాన్ తో పాటు.. ఆయన మొత్తం కుటుంబం 1975 ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన సైనిక తిరుగుబాటులో చనిపోయారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా.. షేక్ రెహానాలు భారతదేశానికి రావాల్సి ఉంది. కట్ చేస్తే.. తండ్రి రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు షేక్ హసీనా. అనంతరం ఆమె ప్రముఖ రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.
2004 ఆగస్టు 21న ఒక ర్యాలీలో షేక్ హసీనా ప్రసంగిస్తున్న వేళలో.. గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ ప్రాంతంలోని హర్కత్ ఉల్ జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణంగా తేల్చారు. ఈ దాడిలో షేక్ హసీనా తీవ్రంగా గాయపడితే.. ఆమె పార్టీ (అవామీ లీగ్)కి చెందిన చాలామంది కార్యకర్తలు మరణించారు.
ఇది జరిగిన 20 ఏళ్లకు మరోసారి ఆగస్టు నెల షేక్ హసీనాను వెంటాడినట్లుగా చెబుతుననారు. ఆగస్టు మొదటి వారంలోని మధ్యాహ్న సమయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విద్యార్థుల (?) ఉద్యమం హింసాత్మకంగా మారటమే కాదు.. దేశంలో అరాచక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి.. అరగంటలో దేశాన్ని విడిచి పెట్టేసి.. భారత్ కు రావాల్సి వచ్చింది.
ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అరగంట వ్యవధిలో ఆమెను దేశం విడిచి పారిపోవాలని.. లేనిపక్షంలో ఆమె హత్యకు గురయ్యే అవకాశం ఉందని సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అప్పుడున్న వాతావరణంలో ఆమెను హత్య చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు.కానీ.. సైన్యం ఆమెను చంపటానికి ఇష్టపడలేదు. వార్నింగ్ ఇచ్చి దేశం నుంచి పారిపోయేలా అవకాశాన్ని ఇచ్చారు.
దీంతో.. దేశానికి ప్రధాని అయిన ఆమె.. కట్టుబట్టలతో దేశాన్ని విడిచి రావాల్సి వచ్చింది. అయితే.. ఈ ఆందోళన మొత్తానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ.. జమాత్ ఎ ఇస్లామీ పార్టీలోని ప్రత్యర్థులు ఏకమై.. పాలనలో మార్పు కోసం ఇదంతా చేశారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు షేక్ హసీనా ప్రతిపక్షాల్ని నామ రూపాల్లేకుండా చేసిందని.. రాజకీయ ప్రత్యర్థులు లేని వేళ.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఇలాంటి పరిస్థితి దాపురించిందన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ అంశంలో అసలేం జరిగిందన్నది పక్కన పెడితే.. ఆగస్టు నెల షేక్ హసీనా తండ్రి కాలం నుంచి కలిసి రాదన్న నమ్మకం మరోసారి నిజమైందని చెప్పకతప్పదు.