పులివెందులలో రాజకీయ కలి పుట్టిందా ?

ఎందుకంటే అక్కడ ఎపుడూ రాజకీయం మారదు అని ఒక దృఢమైన అభిప్రాయంతో ఉంటారు.

Update: 2024-06-30 03:50 GMT

పులివెందుల అంటేనే మరో మాటకు ఆస్కారం లేకుండా వైఎస్సార్ ఇలాకా అని తేల్చేస్తారు. అక్కడ రాజకీయం మీద ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే అక్కడ ఎపుడూ రాజకీయం మారదు అని ఒక దృఢమైన అభిప్రాయంతో ఉంటారు. అదే సమయంలో వైఎస్సార్ హవా అక్కడ ఎపుడూ స్ట్రాంగ్ గా ఉంటుంది.'

ఏ ముహూర్తాన వైఎస్సార్ రాజకీయ అరంగేట్రం చేశారో కానీ నాటి నుంచే పులివెందుల కాస్తా వైఎస్సార్ కంచుకోటగా మారింది. ఆయన వారసులకూ అది రాజకీయంగా అవకాశాన్ని ఇస్తూ వస్తోంది. అలాంటి పులివెందుల తాజా ఎన్నికల్లోనూ జగన్ కి మంచి మెజారిటీతో గెలుపు బాట చూపించింది.

అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఆ మెజారిటీ సగానికి సగం తగ్గింది. ఇదిలా ఉంటే పులివెందులలో వైసీపీకి రాజకీయంగా రోజులు కలసి రావడంలేదా అన్న చర్చ సాగుతోంది. జగన్ ఇటీవల మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటనలు చేసారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని నేరుగా జగన్ కే చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సైతం వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు పదే పదే ఆ విషయానే ప్రస్తావిస్తూ పోవడంతో జగన్ టూర్ కాస్తా మూడు రోజులకే ముగిసిందని వార్తలూ వచ్చాయి.

ఇక పులివెందులలో అభివృద్ధి పనులు చేసిన వారు ఎవరో కాదు వైసీపీ కౌన్స్లిలర్లే.వారే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. అలా పులివెందుల మునిసిపాలిటీలో ఏకంగా 250 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. వారికి బిల్లులు ఆమోదం పొందక నిధులు రావడం లేదు. దాంతో వారంతా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపధ్యంలో తమ బిల్లులు ఆమోదం పొంది డబ్బులు వెనక్కి వస్తాయన్న నమ్మకం అయితే వైసీపీ కౌన్సిలర్లలో సన్నగిల్లుతోందని అంటున్నారు. దాంతో వారిలో మెల్లగా అసమ్మతి రేగుతోంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా బిల్లులు చేయించుకోలేకపోయామని అది అధినాయకత్వం నిర్వాకం మూలంగనే అని కూడా మధనపడుతున్నారు.

ఈ నేపధ్యంలో పులివెందుల మునిసిపాలిటీలోని కౌన్సిలర్లలో అసమ్మతి రేగిందని అది కాస్తా దావానలంగా రాజుకుందని అంటున్నారు. వీరంతా పోయి పోయి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హడావుడిగా వైసీపీ కౌన్సిలర్లను పిలిపించుకుని మరీ బుజ్జగింపు చర్యలకు దిగారని అంటున్నారు

డబ్బులు ఎలా రావో చూద్దామని అవసరం అయితే కోర్టు ద్వారా పోరాటం చేసైనా తెచ్చుకుందామని కౌన్సిలర్లకు అవినాష్ రెడ్డి సర్దిచెప్పారని అంటున్నారు. అయితే ఈ మాటలకు శాంతించని కౌన్సిలర్లు తమకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగిందని తమకు డబ్బులు ఎవరు చెల్లిస్తారని వారు ఈ సమావేశంలో ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారని భోగట్టా.

అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసేవరకు వేచి చూద్దామని అవినాశ్ రెడ్డి కౌన్సిలర్లకు సూచించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి బిల్లులు మంజూరు చేయించుకుందామని అన్నారు. జగన్ మనకు అండగా ఉన్నారు మనం పార్టీని అంటిపెట్టుకుని ఉండాలి అని వారికి పిలుపునిచ్చారు. మరి అవినాష్ పిలుపునకు కట్టుబడి ఎంతమంది కౌన్సిలర్లు ఉంటారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలోనే అసమంతి కుంపటి రాజుకుంటే వైసీపీకి అది తీవ్ర స్థాయిలో నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News