కన్నడ రగడ.. వైరల్ గా మహిళ పోస్టు!
ముందు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో పెట్టగా విమర్శల నేపథ్యంలో 50 శాతం నుంచి 75 శాతమంటూ మార్చారు.
కర్ణాటకలో ప్రైవేటు కంపెనీలు, ఫ్యాక్టరీలు, సంస్థలు, పరిశ్రమల్లో 50 శాతం నుంచి 75 శాతం ఉద్యోగాలు స్థానిక కన్నడిగులకే ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర రగడకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదిత బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీనిప్రకారం మేనేజ్మెంట్ కంపెనీల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక కన్నడిగులకే ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో పెట్టగా విమర్శల నేపథ్యంలో 50 శాతం నుంచి 75 శాతమంటూ మార్చారు.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కంపెనీలు, ఆయా పరిశ్రమలు, నాస్కామ్, పరిశ్రమల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతోంది. కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న పంజాబీ మహిళ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కర్ణాటకను వదిలివెళ్లిపోయానంటూ థ్రెడ్ లో పోస్టు చేశారు. ఈ పోస్టుకి 14 లక్షల ఇంప్రెషన్స్ రావడం విశేషం.
పంజాబీ మహిళ పోస్టు ప్రకారం... తనది పంజాబ్ అని, తనకు పెళ్లయిందని తెలిపారు. బెంగళూరులో ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఏడాదిన్నరపాటు పనిచేశానని షానీనాని తెలిపారు. ఈ క్రమంలో తాను బెంగళూరులో తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు ఆమె తన పోస్టులో తెలిపారు.
‘నేను పంజాబీ డ్రస్సులో ఆఫీసుకు వెళ్లేదాన్ని. దీంతో నా డ్రస్సు చూసినవారు నేను పంజాబీనని అర్థం చేసుకున్నారు. దీంతో వారు తేడాగా ప్రవర్తించేవారు. ఆటోలు ఎక్కాల్సి వచ్చినప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు నేను లోకల్ కాదని.. ఎక్కువ ధరలు చెప్పేవారు. ఇలా ఎక్కువ వసూలు చేసేవారు. నేను ఇంగ్లిష్ లేదా హిందీలో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే కన్నడ రాదా అని గేలి చేసేవారు’ అని షానీనాని తన థ్రెడ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.
‘అలాగే ఒక రోజు ఆఫీసులో కరెంటు పోతే వెంటనే మా ఆఫీసులోనే ఉన్న ఎలక్ట్రిక్ విభాగానికి Ðð ళ్లి విషయం చెప్పాను. అప్పుడు కూడా వారు నాతో కన్నడంలో చెప్పాలని.. ఇంగ్లిష్, హిందీలో చెప్పొద్దన్నారు. కన్నడలో చెబితేనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు’ అంటూ ఆ బాధాకరమైన సందర్భాన్ని పంజాబీ మహిళ తన పోస్టులో వివరించారు.
‘ఇలా నేను బెంగళూరులో ఉన్న ఏడాదిన్నరలో భాష విషయంలో ఎంతో వివక్షతను ఎదుర్కొన్నా. ఎన్నో అవమానాలు పడ్డాను. అందుకే బెంగళూరు వదిలేసి గురుగ్రామ్ కు వచ్చేశా. ఇప్పుడు నా ఇంటిలో ఆనందంగా ఉన్నాను. నేను కోరుకున్న చోటకు వెళ్తున్నా’ అని షానీనాని తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘కన్నడ’ రగడ జరుగుతున్న నేపథ్యంలో పంజాబీ మహిళ పోస్టు వైరల్ గా మారింది. కొందరు ఆమెకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.