ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ఇన్ని లోపాలు ఉన్నాయా?
ఎన్నికల వేళ.. కీలకమైన పోలింగ్ దశ పూర్తైన కాసేపటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించటం మామూలే.
ఎన్నికల వేళ.. కీలకమైన పోలింగ్ దశ పూర్తైన కాసేపటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించటం మామూలే. ఇవాల్టి రోజున ఎన్నేసి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్స్ ను మొదట్నించి ఇస్తున్న మీడియా సంస్థల్లో ఇండియా టుడే ముందుంటుంది. ఎగ్జిట్ సర్వేల మీద పెద్దగా అవగాహన లేని వేళలోనే.. ఈ మీడియా సంస్థ తన అంచనాల్ని వెలువరించేది. ఎన్నికల వేళ.. ఫలితాలకు ముందుగా ఈ సంస్థ చెప్పే అంచనాలకు కాస్తంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
అలా అని ఈ సంస్థ చెప్పినవన్నీ చెప్పినట్లే జరిగాయా? అంటే లేదని చెప్పాలి. ఏ మీడియా సంస్థ అయినా.. ఎగ్జిట్ పోల్ నిర్వహించే ఏ సంస్థ అయినా సరే.. నూటికి నూరు శాతం సర్వే ఫలితాల్ని వెల్లడించటం సాధ్యమయ్యే పని కాదు. కాకుంటే.. ప్రతి పది ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని పక్కాగా అంచనా వేయగలిగారు? అన్నది పెద్ద ప్రశ్న. ఇక.. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ పై పెద్ద రచ్చే నడుస్తోంది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాలు వేయటం తెలిసిందే. వీరి ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీ రెండు ఎంపీ స్థానాల్ని మాత్రమే గెలుచుకుంటుంది. దీన్ని అసెంబ్లీ స్థానాలకు మారిస్తే పదిహేను సీట్ల కంటే ఎక్కువ సీట్లు రాని పరిస్థితి. ఈ ఫలితాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఊరు.. పేరు లేని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. పేరున్న ఒక మీడియా గ్రూప్ నుంచి ఈ తరహా అంచనాపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తన ఎగ్జిట్ పోల్స్ పై సదరు మీడియా సంస్థకు చెందిన టీవీ చానల్ లో చర్చ చేపట్టారు.
ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థ (ఇండియా టుడే)కు చెందిన కన్సల్టింగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై తన సంస్థ వెలువరించిన అంచనాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని.. ఐదేళ్లలో విద్య.. వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. ప్రభుత్వ పాఠశాలలు.. ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయినట్లుగా వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో గ్రామీణ ప్రజలు.. మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారని.. వారంతా ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచినట్లుగా తాను అంచనా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఇన్ని అంశాలు ఉండగా.. ఎగ్జిట్ పోల్ అందుకు భిన్నంగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన.. ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదన్నారు. ఇండియా టుడేతో కలిసి ఎగ్జిట్ పోల్ నిర్వహించిన యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు సర్దేశాయ్ చురకలు వేశారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన ప్రదీప్ గుప్తా.. ‘స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేయటంతో వచ్చిన సానుభూతితో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉందని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అనుకూలించింది’’ అంటూ పదునైన వాదన స్థానే.. పేలవంగా చేసిన విశ్లేషణ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
ఇదిలా ఉండగా.. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సంస్థలు కలిసి చేసిన ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి 2021లో పశ్చిమ బెంగాల్ లోనూ.. గత ఏడాది చివర్లో ఛత్తీస్ గఢ్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న అంచనాలు తప్పు అయిన నేపథ్యంలో.. అలాంటి పరిస్థితే ఏపీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ చోటు చేసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.