కాంగ్రెస్‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న 'అయోధ్య రాముడు'

అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అయోధ్య రాముడు అడ్డంకిగా మారిపోయాడు. బీజేపీ చేస్తున్న రామ‌య్య రాజ‌కీయాల‌తో కాంగ్రెస్ కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

Update: 2023-10-30 10:30 GMT

2018లో త‌మ‌దే అనుకున్న రాష్ట్రం బీజేపీ తిప్పిన రాజ‌కీయ చ‌క్రంతో జారి పోయింది. దీంతో ఇప్పుడు జ‌రు గుతున్న ఎన్నిక‌ల్లో అయినా.. ప‌ట్టు బిగించి అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అయోధ్య రాముడు అడ్డంకిగా మారిపోయాడు. బీజేపీ చేస్తున్న రామ‌య్య రాజ‌కీయాల‌తో కాంగ్రెస్ కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో పెద్ద రాష్ట్రం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌. ఇక్క‌డ ఏకంగా 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దాదాపు అధికారంలోకి వ‌చ్చేసింది. అయితే.. బీజేపీ చ‌క్రం తిప్పి.. కొంద‌రు ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంతో కాంగ్రెస్ విపక్షానికే ప‌రిమితం అయింది. ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అయినా.. గెలుపు గుర్రం ఎక్కి.. అధికారంలోకి రావాల‌ని హ‌స్తం పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కానీ, బీజేపీ చేస్తున్న అయోధ్య రాముడి రాజ‌కీయంతో కాంగ్రెస్‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు. యూపీలోని అయోధ్యంలో రామాల‌యం నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ విష‌యాన్ని బీజేపీ మ‌ధ్య‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్రంగా వాడుతోంది.

ఇక్క‌డి మెజారిటీ హిందువుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. భారీ ఎత్తున అయోధ్య రాముడి హోర్డింగులు ఏర్పాటు చేసి.. ఎన్నిక‌ల ప్ర‌చారం బీజేపీ దంచి కొడుతుండ‌డంతో ఈ విష‌యంలో తాము ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియ‌క కాంగ్రెస్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

అయోధ్య రామాల‌యం అంశాన్ని తాము కూడా అందుకుంటే.. మైనారిటీ ఓటు బ్యాంకు త‌మ‌కు దూర‌మ వుతుంద‌నేది కాంగ్రెస్ భావ‌న‌. అలాగ‌ని చూస్తూ ఊరుకుంటే.. హిందూ ఓటు బ్యాంకు గుండుగుత్త‌గా బీజేపీకి చేరువ‌య్యే ప్ర‌మాద‌ముందని సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో రామాల‌యం, రాముడి ప్రచారం త‌గ‌దంటూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. కానీ, ఇది కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని, ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది. ఈ ప‌రిణామం కాంగ్రెస్‌ను డోలాయ‌మానంలో ప‌డేసింది. మ‌రేం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News