అయోధ్య రాములోరి పాదుకలు సైతం హైదరాబాద్ నుంచేనట
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులు తరలి వెళుతున్నాయి.
దేశ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు అయోధ్య మీదనే. ఈ నెల (జనవరి) 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రాముల వారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులు తరలి వెళుతున్నాయి.
తాజాగా రామమందిరంలో ఉంచే పాదుకలను హైదరాబాద్ లో తయారు చేశారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతమైన బోయిన్ పల్లికి చెందిన ఒక లోహ కళాకారుడు వీటిని తయారు చేశారు. బోయిన్ పల్లికి చెందిన శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగచారి ఈ పాదకుల్ని తయారు చేశారు.
ఈ పాదకుల్ని 15 కేజీల పంచలోహాల్ని వాడటంతో పాటు వెండి.. బంగారంతో తాపడటం చేశారు. వీటి తయారీకి 25 రోజులు పట్టిందని.. ఈ పాదుకలను అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థపాకుడు చర్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. అయితే.. ఆసక్తికరమైన అంశం ఏమంటే. .ఇదే బోయిన్ పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో వారు అయోధ్య రామాలయానికి వినియోగించే తలుపుల్ని తయారు చేయటం తెలిసిందే.
అయోధ్య రామాలయ ట్రస్టు నిర్వహించిన టెండర్లలో ఈ సదవకాశాన్ని పెద్దపెద్ద కంపెనీలతో పోటీ పడి మరి అనురాధ టింబర్ డిపో దక్కించుకుంది. దీంతో.. హైదరాబాద్ సత్తా దేశానికి మరోసారి తెలిసిన పరిస్థితి. తాజాగా రాములోరి పాదుకల్ని సైతం నగరంలోనే తయారు చేయించిన వైనం ఆసక్తికరంగా మారింది.