కూటమి నేతలకు దసరా గిఫ్ట్ లు అంటున్న చంద్రబాబు

అందుకే ఆయన చాలా ఈజీగా పదవుల పందేరం చేయరు. అన్నీ చూసి మరీ ఎంపిక చేస్తారు.

Update: 2024-09-16 16:29 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎపుడు ఏమి చేయాలో బాగా తెలుసు. అధికారం అన్నది ఎంత విలువైనదో కూడా తెలుసు. పదవులు ఊరకే రావు వాటి వెనక బాధ్యతలు ఉంటాయి. అందుకే ఆయన చాలా ఈజీగా పదవుల పందేరం చేయరు. అన్నీ చూసి మరీ ఎంపిక చేస్తారు. ఆ విధంగా పదవులు అందుకున్న వారికి కూడా దాని విలువ ఏమిటో తెలుస్తుంది.

ఈ విషయంలో ఇతర పార్టీల నేతలకు చంద్రబాబు భిన్నం. ఆయన ఏ నిర్ణయం విషయంలో అయినా నానుస్తారు అని అంటారు. కానీ రాజకీయాల్లో అదే కరెక్ట్ అని బాబు డెసిషన్లు అనేకం రుజువు చేశాయి. ఇక చూస్తే టీడీపీ వంద రోజుల పాలనను తొందరలో పూర్తి చేసుకోబోతోంది. తొందరలోనే తెలుగు వారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన దసరా పండుగ కూడా ఉంది.

దాంతో తమ్ముళ్లతో పాటు కూటమి నేతలకు నామినేటెడ్ పదవులను పంచడం ద్వారా బాబు అతి పెద్ద గిఫ్ట్ ని రెడీ చేశారు అని అంటున్నారు. దానికి అయన ఒక ఫార్ములా రూపొందించారు అని అంటున్నారు టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 అన్న నిష్పత్తిలోనే మొత్తం పదవుల పంపిణీ ఉంటుంది. ఏపీ మొత్తంగా చూసుకుంటే వివిధ రకాలైన కార్పోరేషన్ చైర్మన్ పదవులు వందకు పైగా ఉన్నాయి. దీనిలో టీడీపీ తమ్ముళ్లకు అరవై దాకా చైర్మన్ పదవులు దక్కుతాయి అన్న మాట. అలాగే జనసేనకు ముప్పయి దాకా లభిస్తాయి. ఇక బీజేపీకి పది దాకా వస్తాయి.

ఈ లెక్క కూడా బాగానే ఉంది. ఇక తొలి విడతగా మొత్తం కార్పోరేషన్ పదవులలో ఇరవై శాతం భర్తీ అంటున్నారు. అంటే 20 కార్పోరేషన్లకు చైర్మన్లు సహా కార్యవర్గాలు అని భావించాలి. అందులో అరవై శాతం అంటే టీడీపీకి 12, అలాగే ముప్పయి శాతం అంటే జనసేనకు ఆరు, బీజేపీకి పది శాతం అంటే రెండు కార్పోరేషన్ల చైర్మన్ పదవులు దక్కనున్నాయని చెబుతున్నారు.

వీటి ప్రక్రియని ఒకటి రెండు రోజులలో మొదలెట్టి ఈ నెలాఖరులోగా పంపిణీ చేయడానికి టీడీపీ కూటమి పెద్దలు సర్వం సిద్ధం చేశారు అని అంటున్నారు. ఆ మీదట మరో ఇరవై శాతం పదవులను దసరా ముందు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే టీడీపీలో 24 మందికి జనసేనలో 12 మందికి బీజేపీలో నలుగురుకీ చైర్మన్ కిరీటాలు దక్కనున్నాయని అంటున్నారు.

తొలి విడతలో చూస్తే ఒకటి రేపటి నుంచే ఈ పదవుల భర్తీ ప్రక్రియ ఉండనుంది అని అంటున్నారు. ఎవరెవరికి ఏయే కార్పోరేషన్ల పదవులు ఇవ్వాలి అన్నది ఈపాటికే అంతా కసరత్తు జరిగింది అని అంటున్నారు. అలాగే కీలకమైన కార్పోరేషన్ల చైర్మన్ పదవులు ఏ ఏ పార్టీకి ఇవ్వాలి అన్నది కూడా పక్కాగా చూసుకున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఈ ప్రక్రియ రేపటి నుంచి మొదలెడితే ఈ నెలాఖరు నాటికి తొలి విడతలో అందరికీ పదవులు దక్కుతాయని చెబుతున్నారు.

ఇక నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ వరకూ చూస్తే టికెట్లను త్యాగం చేసిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని అంటున్నారు. అలాగే నియోజకవర్గాలలో గట్టి నేతలుగా ఉంటూ పార్టీకి మరింతగా పనికి వస్తారు అనుకున్న వారికే ఈ పదవులు అని అంటున్నారు. ఇక ఈ పదవుల భర్తీలో కులాలు ప్రాంతాలు విధేయత ఇత్యాదివి కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు.

జనసేన వరకూ చూస్తే ఉత్తరాంధ్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీకి గోదావరి జిల్లాల తరువాత ఉత్తరాంధ్రాలోనే ఎక్కువ బలం ఉంది. అయితే అనుకున్న స్థాయిలో సీట్లు ఇటీవల ఎన్నికల్లో ఉత్తరంధ్రాలో పొందలేకపోయింది. దాంతో ఆ లోటుని భర్తీ చేయడానికి ఈసారి ఈ రీజియన్ లోనే ఎక్కువ మంది త్యాగమూర్తులకు నామినేటెడ్ పదవుల అందలం ఎక్కించాలని చూస్తోంది. బీజేపీ కూడా విశాఖ జిల్లాలో ఆశావహులకు పదవులు ఇవ్వాలని అనుకుంటోంది.

Tags:    

Similar News