టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబుమోహన్.. ఫ్యూచర్ ప్లాన్ అదేనా..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీలో పార్టీ అధికారంలోకి రావడంతో అధినేత చంద్రబాబు తెలంగాణపైనా ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలోనూ పార్టీకి ఒకప్పటి వైభవం తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ నేతలతో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు కూడా. ఇందులో భాగంగానే వారానికి రెండు రోజులు తెలంగాణకు సైతం వచ్చి పార్టీ కార్యక్రమాలపై చర్చించేందుకు నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. తెలంగాణలో ఓ కీలక నేత టీడీపీ సభ్యత్వం పొందడం చర్చకు దారితీసింది.
ఎట్టకేలకు ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టడం.. చంద్రబాబు కూడా తెలంగాణపై దృష్టి సారించడంతో తెలంగాణ లోని పలువురు నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబును కలిశారు. ఒకప్పుడు టీడీపీ నుంచే ప్రస్థానం ప్రారంభించిన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు లక్ష్యం కూడా అదే కావడంతో తెలంగాణలోనూ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను ప్రారంభించారు. రూ.100 సభ్యత్వంతో పాటు రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దాంతోపాటు రూ.లక్షతో శాశ్వత సభ్యత్వం పొందేలా కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో పాత కాపులంతా టీడీపీ గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. సభ్యత్వాలపై ఈనెల 25న హైదరాబాద్‌లోని సభ్యత్వాల నమోదుపై సమావేశం జరిగింది. అదే సందర్భంలో అక్కడ మాజీమంత్రి, కమెడియన్ బాబుమోహన్ సైతం చంద్రబాబును కలిసి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడిపోవడం వల్ల ఇబ్బందులు పడ్డానని, అవకాశం ఇస్తే మళ్లీ పార్టీలో చేరుతానంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. దాంతో బాబుమోహన్ టీడీపీలో చేరిక ఖాయమనే ప్రచారం జరిగింది. తాజాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేశారు. అందోల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. టీడీపీలో చేరినట్లుగా ప్రకటించారు.
బాబుమోహన్ 1998లో అందోల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 1999 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004,2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో బాబుమోహన్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2023లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. ఆ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు దగ్గరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్న తరుణంలో సొంత గూటికి చేరాలని అనుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలతో తెగతెంపులు చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేక.. టీడీపీ గూటికి చేరిపోయారు.