తొలి అడుగు: కష్టాన్ని ఇష్టంగా ఎత్తుకున్న చంద్రబాబు..!
ఎందుకంటే.. ఇతర సూపర్ సిక్స్ పథకాలకు.. జూలై 1న అమలు చేస్తున్న పథకాలకు కూడా వ్యత్యాసం ఉంది.
తొలి అడుగు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 20 రోజులకు ప్రభుత్వం తొలి అడుగు వేయ నుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సంచలన హామీలను అమలు చేసేందుకు నడుం బిగించింది. దీని లో భాగంగా.. జూలై 1వ తేదీన కీలకమైన అడుగు పడనుంది. అయితే.. ఇది తప్పదు.. చేయాల్సిందే అనే భావన ఉండడం గమనార్హం. ఎందుకంటే.. ఇతర సూపర్ సిక్స్ పథకాలకు.. జూలై 1న అమలు చేస్తున్న పథకాలకు కూడా వ్యత్యాసం ఉంది.
పింఛన్లను సమయానికి అందిస్తామని.. ఎన్నికలకు ముందు చెప్పారు. పైగా.. దీనికి టైం బౌండ్ పెట్టారు. దీంతో పింఛన్లను జూలై 1న ఖచ్చితంగా అందించాల్సి ఉంది. ఇతర సూపర్ సిక్స్‌పథకాలకు పెద్దగా సమయం అయితే పెట్టలేదు. దీంతో అవి లేటయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. తొలి అడుగు వేస్తున్న చంద్రబాబు సర్కారుకు.. ఇదేమంత ఈజీ వ్యవహారం కాదు. పింఛన్లను రూ.1000 చొప్పున పెంచాలి. ఇదేసమయంలో దివ్యాంగులకు రూ.3000 పెంచాలి.
ఈ రెండు చాలా కీలకం. ఇక, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది కనుక.. ఆ విషయంలో రూ.5 నుంచి 15వేలకు పెంచినా.. సర్కారుకు ఇబ్బంది లేదు. కానీ, సాధారణ పింఛనును రూ.3000 లనుంచి 4 వేలకు పెంచడంతో ఇది 50 లక్షల మంది పై ప్రభావం చూపనుంది. అంటే.. నెలకు రూ. 5 కోట్ల కుపైగానే భారం పడనుంది. ఇక, దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి 6 వేలకు పెంచారు. ఇది కూడా.. 5-8 లక్షల మధ్య ఉన్నవారికి వర్తింప చేయాలి.
దీంతో ఇంత పెద్ద మొత్తం సమీకరించడం.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇబ్బందే. అయినా.. కూడా తొలి అడుగు కావడం.. సర్కారుపై రాష్ట్రంలో చాలానే ఆశలు ఉండడంతో చంద్రబాబు.. కష్టమే అయినా.. ఇష్టంగానే అమలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను కేంద్రంనుంచి సాయం తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రానికి అన్ని బ్యాంకుల్లోనూ సంక్షేమ పింఛను కు సంబంధించిన నిధులను రెడీ చేయనున్నారు. తద్వారా.. ఇప్పటి వరకు చంద్రబాబుపై ఉన్న సంక్షేమ పథకాలకు, ఉచిత పథకాలకు వ్యతిరేకమనే ముద్రను తుడుచుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.