కులగణన ఓకే కానీ ఈ నైపుణ్య గణన ఏమిటి?.. ఎందుకు?

ఆయా రాష్ట్రాల్లో కుల గణన జరిపించాలని ఆయా పార్టీలు, ఆయా కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Update: 2024-06-29 06:40 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిగా ఐదు ఫైళ్లపైన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో స్కిల్‌ సెన్సస్‌ (నైపుణ్య గణన) కూడా ఉంది.

వాస్తవానికి ఇప్పుడు దేశమంతా కుల గణన మీద చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో కుల గణన జరిపించాలని ఆయా పార్టీలు, ఆయా కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన ఆధారంగా ఎక్కువ జనాభా ఉన్న కులాలకు అన్ని రంగాల్లో న్యాయం చేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే బీహార్, తదితర రాష్ట్రాలు కుల గణనకు సిద్ధమయ్యాయి.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం.. కుల గణన కంటే నైపుణ్య గణనకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ముందు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే నైపుణ్య గణన నిర్వహిస్తామని తెలిపారు.

వాస్తవానికి నైపుణ్య గణన జనసేన పార్టీ ఆలోచన. పవన్‌ కోరిక మేరకు దీన్ని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టారు. స్కిల్‌ గణనలో భాగంగా ప్రభుత్వం రాష్టమంతా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తుంది. ప్రతి ఇంటిలో 18 ఏళ్లు నిండినవారు, చదువుకుంటున్నవారు ఎవరు ఉన్నారో, వారు ఏ కోర్సులు చదివారో, వారికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుంటారు. ఏ స్కిల్స్‌ నేర్పిస్తే వారు వీలయినంత త్వరగా ఉద్యోగం లేదా ఉపాధి పొందగలరో ఆరా తీస్తారు.

స్కిల్‌ గణన పూర్తయ్యాక రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎవరికి ఎలాంటి స్కిల్స్‌ అవసరమో వాటిని నేర్పిస్తారు. ప్రభుత్వమే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. ఉచితంగానే శిక్షణ అందజేసి ఉద్యోగం లేదా జీవనోపాధిని పొందేలా చేస్తారు. తద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక ప్రగతికి, నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం దోహదం చేస్తుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి ఐదు సంతకాల్లో ఒకదాన్ని స్కిల్‌ సెన్సస్‌ పై పెట్టారు. ఈ క్రమంలో జూన్‌ 13న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్కిల్‌ గణనను వెంటనే ప్రారంభించాలని అందులో పేర్కొంది. జూన్‌ 24న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నైపుణ్య గణనకు మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నో ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మా, బీఈడీ, డీఈడీ తదితర కోర్సుల కళాశాలలు ఉన్నాయి. ఏపీలో మొత్తం 310 ఇంజినీరింగ్‌ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్‌ కాలేజీలు, 516 ఒకేషనల్, ఐటీఐ కాలేజీలు ఉన్నాయని సమాచారం. ఈ కళాశాలల నుండి ఏటా సుమారు 4.4 లక్షల మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. అయితే వారిలో కేవలం 1 శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలినవారంతా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. చదువుకుని కూడా చిన్నాచితకా పనులతో మరికొందరు కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ సెన్సస్‌ ద్వారా యువతలోని నైపుణ్యాలను గుర్తిస్తుంది. వారికి ఎందులో నైపుణ్యాలు అవసరమో తెలుసుకుంటుంది. ఆ మేరకు వారికి శిక్షణ అందిస్తుంది. యువత తమ కాళ్లపై తాము నిలబడేలా.. ఆర్థిక పరిపుష్టిని సాధించేలా ప్రభుత్వం సాయం అందజేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే నైపుణ్య గణన ప్రారంభం కానుంది.

Tags:    

Similar News