ఆళ్ల నాని సైకిలెక్కే ముహూర్తం ఫిక్స్... టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతల జాబితాలో మరో పేరు జతయ్యింది!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతల జాబితాలో మరో పేరు జతయ్యింది! ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడిన నేపథ్యంలో.. ఆ జాబితాలో తాజాగా మరో మాజీ మంత్రి చేరారు! ఈ సందర్భంగా ఆయన అధికారికంగా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
అవును... వైసీపీని వీడి సైకిల్ ఎక్కుతున్న నేతల జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. ఇందులో భాగంగా... మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని బుధవారం (డిసెంబర్ 18)న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోనున్నారు.
ఈ సందర్భంగా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాకను టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని.. అయితే, అధిష్టానం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు!
అయినప్పటికీ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడే ఉన్నారని తెలిపారు! మరోపక్క ఇప్పటికీ ఆళ్లనాని చేరికపై చాలా మంది కార్యకర్తలు అయిష్టంగానే ఉన్నారని నొక్కి చెప్పారు! అయినప్పటికీ తమకు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం ఆళ్ల నాని చేరిక ఉంటుందని ప్రకటించారు.
కాగా... వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి పార్టీలో చేరారు ఆళ్ల నాని. ఈ క్రమంలోనే జగన్ కు అత్యంత సన్నిహితునిగా కొనసాగుతూ వచ్చారని అంటారు. ఈ సమయంలో.. కాపు సామాజికవర్గానికి చెందిన ఆళ్ల నానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు.
దీంతో... గత ప్రభుత్వ హాయాంలో ఓ వెలుగు వెలిగిన ఆళ్ల నాని.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారని అంటారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం వైసీపీ జిల్ల అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరబోతున్నారు.