వాలంటీర్లకు శుభవార్త అందినట్లే ?
తాజాగా వాలంటీర్ల వాట్సప్ గ్రూపులను తొలగించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ నడుస్తోంది. వాలంటీర్లకు గత రెండు నెలలుగా జీతాలు లేవు. తాజాగా వాలంటీర్ల వాట్సప్ గ్రూపులను తొలగించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు ఆయన వాలంటీర్లకు గ్యారంటీ ఇచ్చారు.
వాలంటీర్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని అన్నారు. వారికి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తుందని ఆయన చెబుతూ ఒక శుభవార్తనే వినిపించారు. వాలంటీర్లు ఈ విషయంలో ఎలాంటి అపోహలూ పెట్టుకోనవసరం లేదని అన్నారు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.
వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న దానిపైన కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. తాము మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే పెట్టామో అవన్నీ తుచ తప్పకుండా అమలు చేసి తీరుతామని మంత్రి భరోసా ఇచ్చారు.
అందువల్ల వాలంటీర్లు తమ భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు వాలంటీర్లని నిజానికి భయపెట్టి బెదర గొడుతున్నది వైసీపీయే అని ఆయన ఆరోపించారు వారిని గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయాలకు వాడుకుందని ఆయన అన్నారు పైకి ప్రభుత్వ సేవలు అని చెప్పి వైసీపీ కోసం వినియోగించుకుని ఎన్నికల వేళ ఎటూ కాకుండా చేశారని ఆయన మండిపడ్డారు.
వాలంటీర్ల సేవలను రెన్యూవల్ చేయకుండా గత ఏడాది కాలంగా దగా చేసింది వైసీపీ ప్రభుత్వమే అని మంత్రి ఆరోపించారు. ఇక ఎన్నికల వేళ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు చేయించి మోసం చేసింది వైసీపీయే అని ఆయన గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు వాలంటీర్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అనేక హామీలు ఇచ్చినా కూడా తప్పు దోవ పట్టించింది వైసీపీ నేతలే అని అన్నారు.
అందువల్ల వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అంటున్నారు. అయితే వాలంటీర్లు కోరేది ఏంటి అంటే గత రెండు నెలలుగా తమకు వేతనాలు లేవని వాటిని రిలీజ్ చేయమని. అలాగే తమను తిరిగి విధులలోకి తీసుకోమని. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన రావాలని వారు కోరుతున్నారు.
మరి మంత్రి అయితే అనేక సార్లు ఇప్పటికే వాలంటీర్ల విషయంలో హామీ ఇచ్చారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతోంది. వాలంటీర్ల విషయంలో ఒక ప్రకటక స్పష్టంగా వెలువడితేనే తమకు ఆందోళన తగ్గుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి స్వామి వరం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన కోసమే వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు.