ఆ పేరు పెడుతామంటే ఇళ్లు ఇవ్వం.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కేంద్ర మంత్రి కట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ల విషయమై విజ్ఞప్తి చేశారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కేంద్ర మంత్రి కట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ల విషయమై విజ్ఞప్తి చేశారు. దాంతో ఈ రోజు కరీంనగర్ కేంద్రంగా సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.
పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు ఇండ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పేడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చిచెప్పారు. కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధాని మోదీ ఫొటో ముద్రించాల్సిందేనని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకపోతే ఉచిత బియ్యం కూడా ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామని సంజయ్ తేల్చిచెప్పారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే తాను కొట్లాడితేనే ఆ నిధులను కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఇంత కష్టపడ్డా.. తనను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని, బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి గురువు కేసీఆరే అని పేర్కొన్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫాంహౌజ్ సహా స్కాంలన్నీ మరుగునపడ్డాయని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రేపే అరెస్ట్ అంటూ.. నెల రోజులు ఊదరగొట్టి ఏం సాధించారని నిలదీశారు.
కేటీఆర్ అరెస్ట్‌కు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తరువాత కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారని.. గ్రీన్ కో వంటి సంస్థలను భయపెట్టడంవల్ల ఏం లాభం అని తెలిపారు. గ్రీన్ కో సంస్థ నుండి కాంగ్రెస్ పార్టీకి చందాల రూపంలో పైసలు ముట్టాయన్నారు. పార్టీ చందాల పేరుతో పైసలు తీసుకుని మళ్లీ ఆ సంస్థనే ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పుడు దావోస్ పెట్టుబడులతో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారని.. 2014 నుండి ఇప్పటి వరకు దావోస్ పర్యటనల్లో ఎన్ని పెట్టుబడులుకు ఎంఓయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు? లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఆచరణలో ఎన్ని పెట్టబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని సవాల్ చేశారు.
బీఆర్ఎస్ స్కాంలపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని.. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నరని సంజయ్ వాపోయారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక చస్తున్నా పట్టించుకోరని, పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించరని అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం నిధులే కారణమని తెలిపారు. కేంద్రం నిధులిస్తే... దొబ్బిపోతున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు.