హిందూ సాధువుకు బంగ్లా హైకోర్టు బెయిల్ కు నో!

బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న సాధువు చిన్మయ్ క్రిష్ణదాస్కు బెయిల్ ఇవ్వటానికి ఆ దేశంలోని చిట్టగాంగ్ హైకోర్టు నో చెప్పింది.

Update: 2025-01-02 13:30 GMT

బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు.. తదనంతర పరిస్థితుల తర్వాత ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. బంగ్లాదేశ్ లోని మైనార్టీలైన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు సాగుతున్నాయి. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆ దేశం పట్టించుకోని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న సాధువు చిన్మయ్ క్రిష్ణదాస్కు బెయిల్ ఇవ్వటానికి ఆ దేశంలోని చిట్టగాంగ్ హైకోర్టు నో చెప్పింది.

దేశ ద్రోహ కేసును ఎదుర్కొంటున్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అక్కడి కోర్టులు ఒకటి తర్వాత ఒకటిగా నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బెయిల్ పిటిషన్లు దాఖలు అవుతున్నా.. కోర్టులు పట్టించుకోవటం లేదు. డయాబెటిస్.. శ్వాసకోశ సమస్యలతో దాస్ బాధపడుతున్న ఆయనకు బెయిల్ అవసరం ఉందని పేర్కొన్నప్పటికి పెద్దగా పట్టించుకోని పరిస్థితి. మరోవైపు జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో హిందువులు ఆందోళన చెందుతున్నారు.

బెయిల్ కోసం పదకొండు మంది లాయర్ల టీం ప్రయత్నాలు చేసింది. అయినప్పటికి ఫలించలేదు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. చిన్మయ్ అరెస్టు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ కేసులోని తీవ్రత కారణంగా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకర్తగా పని చేస్తున్న చిన్మయ్ క్రిష్ణదాస్ గత ఏడాది నవంబరులో చిట్టగాంగ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొనటం.. ఆ సందర్భంగా బంగ్లాదేవ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదిపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆయనపైనా బెదిరింపులకు పాల్పడ్డారు.

మరోవైపు ఆయనపై నమోదు చేసిన కేసులన్ని కూడా తప్పుడు.. కల్పిత అంశాలతో కూడుకున్నవన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆయన అరెస్టు తర్వాత డిసెంబరు మూడున జరిగిన విచారణకుఆయన తరఫు హాజరవ్వాల్సిన న్యాయవాది భద్రతా సమస్యల కారణంగా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో.. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 2కు వాయిదా పడింది. హిందువులకు చట్టపరమైన హక్కులు ఉన్న నేపథ్యంలో విచారణ న్యాయంగా.. పారదర్శకంగా జరుగుతుందన్న ఆశాభావాన్ని భారత్ ప్రకటించింది. హిందువులు.. ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ను భారత్ కోరినప్పటికి సానుకూల నిర్ణయాలు వెలువడటం లేదు.

Tags:    

Similar News