టీడీపీలో చేరికలు బంద్...మ్యాటర్ అదే...?
అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను లాగాలని టీడీపీ ప్లాన్. అయితే దాన్ని గండి కొట్టేలా అరెస్ట్ జరిగిపోయింది.
ఏపీ టీడీపీ ఎన్నడూ లేనంత ఇబ్బందులలో ఉంది. అధినేత చంద్రబాబు గత నెల రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఎపుడు బయటకు వస్తారు అన్నది ఎవరికీ తెలియడంలేదు. పుణ్య కాలం కాస్తా గడచిపోతోంది. నిజానికి బాబు కనుక అరెస్ట్ కాకుండా ఉండి ఉంటే ఈ పాటికి బాబు ఏపీ అంతా టూర్లు చేసేవారు
అదే విధంగా అక్టోబర్ లో మంచి రోజులు అని ఆపరేషన్ ఆకర్ష్ ని టీడీపీ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది అంటున్నారు. అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను లాగాలని టీడీపీ ప్లాన్. అయితే దాన్ని గండి కొట్టేలా అరెస్ట్ జరిగిపోయింది. చంద్రబాబు జైలులో ఉండడం వల్ల టీడీపీ ఫ్యూచర్ ఏంటో కళ్ల ముందు కనిపించింది అని అంటున్నారు.
బాబుకు పలుకుబడి ఎక్కువ అని ఆయన ఇలా వెళ్ళినా అలా వచ్చేస్తారు అనుకున్న వారికి ఇపుడు తన నమ్మకాలు తప్పు అని అర్ధం అవుతున్నాయని అంటున్నారు. అదే టైం లో టీడీపీ అంతా వన్ మ్యాన్ ఆర్మీ గా బాబు తయారు చేశారు అన్న మరో నగ్న సత్యం బయటపడింది. ఏ పార్టీకైనా నాయకుడు ఉంటారు. కానీ నాయకుడే సర్వస్వం కాదు. ఒక వేళ నాయకుడు ఇబ్బందులలో చిక్కుకున్నా లేక ఆయన వెనక్కి తగ్గినా తరువాత నాయకత్వం ముందుకు ఉరకాలి.
అలాంటి మెకానిజం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీలో అయితే లేదు అని బాబు అరెస్ట్ నిరూపించింది అని అంటున్నారు. ఎందరు పెద్ద నేతలు ఉంటేనేమిటి టీడీపీలో బాబు లేకపోతే అంతా అయోమయం, అంతా గందరగోళం అన్నది అర్ధం అవుతోంది అంటున్నారు. మరో వైపు చూస్తే యువగళం ద్వారా నారా లోకేష్ ని చంద్రబాబు అంతటి స్థాయి నేత అని బిల్డప్పులు ఇచ్చారు. ఎల్లో మీడియా అయితే ప్రతీ రోజూ హెడ్ లైన్స్ లో పెట్టి మరీ లోకేష్ న్యూస్ కవర్ చేసేది.
సరే ఎంతలా పొగిడినా అసలైన సవాల్ వచ్చినపుడే కదా నాయకుడు అన్న వాడు జవాబు చెప్పాలి. అలాంటి విషయం తీసుకుంటే ఇపుడు లోకేష్ తేలిపోయాడు అని అంటున్నారు. తండ్రి చంద్రబాబు జైలులో ఉన్న నేపధ్యంలో పార్టీకి నేనున్నాను అని గట్టిగా నిలబడి సంక్షోభాన్ని నిభాయించలేకపోయాడు అన్న విమర్శ అయితే ఉంది. అలా టీడీపీ నాయకత్వం సంక్షోభంలో ఉంది అన్నది గట్టిగా కనిపించేలా ఈ అరెస్ట్ చాటి చెప్పింది అని అంటున్నారు.
ఇక రేపటి రోజున చంద్రబాబు ఎలాగూ బయటకు వస్తారు. ఆయన మీదనే పార్టీ ఆశలు కూడా పెట్టుకుంది. కానీ బాబు వచ్చిన తరువాత పార్టీని నడపడం వేరు. ఆయన లేకపోయినా టీడీపీ సాగడం వేరు. ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబు మీద ఆశ పెట్టుకుని టీడీపీ కొనసాగుతోంది అంటే ఎప్పటికైనా డేంజర్ సిగ్నలే అన్న సందేశం మాత్రం ఇతర పార్టీ జనాల్లోకి వెల్ళిపోయింది.
చంద్రబాబు మహా అయితే ఈ ఎన్నికల వరకూ గట్టిగా నిలబడగలరు, ఆ తరువాత టీడీపీ సంగతేంటి, అంటే భవిష్యత్తు బెంగను మాత్రం ఈ పరిణామం అలా ఉంచింది అంటున్నారు. ఒకవేళ బాబు అరెస్ట్ కాకపోయి ఉంటే మాకు లోకేష్ ఉన్నారనుకుని చాలా మంది ఆ పార్టీలో చేరేవారు. ఉన్న వారూ స్థిమితంగా ఉండేవారు.
మరి టీడీపీలో ఈ రోజున చేరి ఒక దశాబ్ద కాలం అయినా హ్యాపీగా రాజకీయం చేసుకోవచ్చా అన్నదే ఇపుడు ఇతర పార్టీలలో ఉన్న వారికి కానీ లేక ఆ పార్టీ ఆల్ రెడీ ఉన్న వారికి కానీ దొలిచేస్తున్న ప్రశ్నట. బాబు అరెస్ట్ కక్ష సాధింపు కాదు, దాని వెనక ఎన్నో లెక్కలు ఉన్నాయి. అందులో అతి ప్రధానం అయినది చంద్రబాబు తరువాత నో టీడీపీ అని లోకానికి చాటి చెప్పడమే. ఈ విషయంలో వైసీపీ నూరు శాతం సకెస్ అయింది అని అంటున్నారు.