కాల్పులకు గురైన ట్రంప్.. స్రీక్రెట్ వెపన్ 17 ఏళ్ల కుర్రాడట
ట్రంప్ చెబుతున్న 17 ఏళ్ల కుమారుడి పేరు బారన్. ట్రంప్-మెలానియాల కుమారుడు ఇతడు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు.
అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల్లో ఈసారి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా పనిచేసి తదుపరి ఎన్నికల్లో ఓటమిపాలైన నాయకుడు నాలుగేళ్ల విరామం తర్వాత బరిలో నిలవడం ఆశ్చర్యమైతే.. అధ్యక్షుడిగా ఉంటూ రెండోసారీ పోటీకి దిగిన నాయకుడు మధ్యలోనే తప్పుకోవడం.. మాజీ అధ్యక్షుడు.. ఉపాధ్యక్షురాలిగా ఉన్న మహిళతో ఢీకొనాల్సి రావడం.. అందులోనూ ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం మరో విశేషం. ఇక హైలైట్ ఏమంటే అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరగడం.
యూత్ దే ప్రధాన పాత్ర
అమెరికా అంటే అందరి కలల రాజ్యం. అక్కడ కూడా అన్ని దేశాల్లోలాగే యువ ఓటర్లదే ప్రధాన పాత్ర. వారిని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి జనరేషన్ 'జీ' ఓటర్లు అత్యంత ముఖ్యంగా మారారట. వారి సంఖ్య ఇంతని కచ్చితంగా తేలకున్నా.. 41 మిలియన్ల మంది యువ ఓటర్లు ఉన్నట్లు అంచనా.
సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్లతో..
టెక్నాలజీకి కూడా పెద్దన్న అయిన అమెరికాలో అధ్యక్ష అభ్యర్థలు సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్లను రంగంలోకి దించారట. ఇందులో కమలాదే ముందంజ అని చెబుతున్నారు. దీంతో ట్రంప్ మేల్కొన్నారు. జనరేషన్ జీ వారికి వల వేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు 'సీక్రెట్ వెపన్ (రహస్య ఆయుధం)' తనవద్ద ఉందని తెలిపారు. అయితే, అదేమిటో కాదు.. ట్రంప్ చిన్న కుమారుడు. అతడి వయసు 17 ఏళ్లు. అతడినే తన 'ట్రంప్ కార్డ్' అంటున్నారు.
ఎక్కుపెట్టిన బ్యారన్..
ట్రంప్ చెబుతున్న 17 ఏళ్ల కుమారుడి పేరు బారన్. ట్రంప్-మెలానియాల కుమారుడు ఇతడు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఫ్లోరిడా లో ప్రచారంలోనూ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో అతడు మంచి కుర్రాడని.. మేటి అథ్లెట్ అని... చాలా తెలివైన వ్యక్తి. ప్రజల దృష్టిని ఆకర్షించాడని సీనియర్ ట్రంప్ పొగిడారు. యువతను ఆకట్టుకోవడం ఎలాగో అతడికి బాగా తెలుసని చెప్పారు. దీన్నిబట్టి జనరేషన్ జీ ఓటర్ల విషయంలో తామువిజయం సాధించినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎంతయినా తండ్రి కదా.. బారన్ ఎప్పటికీ తన దృష్టిలో చిన్నపిల్లాడే అని కూడా ముద్దు చేశారు.