బెజవాడను బెదరగొడుతున్న అమావాస్య పోటు

విజయవాడ ఇపుడు నిండా మునిగింది. అయితే ఈ పరిస్థితిని వీలైనంత మేరకు తగ్గించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయి పనిచేస్తోంది.

Update: 2024-09-02 14:33 GMT

విజయవాడ ఇపుడు నిండా మునిగింది. అయితే ఈ పరిస్థితిని వీలైనంత మేరకు తగ్గించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయి పనిచేస్తోంది. అదే సమయంలో అమావాస్య గండం కూడా బెజవాడను బెదరగొడుతోంది. శ్రావణ మాసం బహుళ అమావాస్య సోమవారం అంతా ఉంది. దాంతో అమావాస్య నాడు సముద్రం పోటెత్తుతోంది. దాంతో ఏమి జరుగుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటున్నారు.

మరీ ముఖ్యంగా క్రిష్ణా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజానీకం అయితే ప్రాణాలను అరచేత పట్టుకుంటున్నారు. అమావాస్య దినాలలో సముద్రం పొటెత్తితే వెల్లువలా వచ్చే వరద నీరు సాఫీగా సముద్రంలోకి పోలేదు. సముద్రం కూడా దానిని తొందరగా తీసుకోలేదు. అయితే పై నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. దాంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్ కి దాదాపుగా 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరింది.

దాంతో వరద నీటిని అన్ని గేట్లూ తెరచి మరీ సముద్రంలోకి వదులుతున్నారు. మరో వైపు క్రిష్ణా నది చూస్తే పరవళ్ళు తొక్కుతోంది. అదే దూకుడుతో ఉంది. ఇక బుడమేరు తన ప్రతాపం చూపిస్తోంది. ఏ మాత్రం వరద ఉధృతి అక్కడ తగ్గలేదు. ఇలా ఏ వైపు చూసినా వరదనీరు పొంగి పొరలేలా ఉంది. ఈ నీటిని అంతటికె తనలో కలిపేసుకునే ఏకైక శక్తి సముద్రానికే ఉంది.

కానీ సరిగ్గా ఈ సమయంలో అమావాస్య ఘడియలు వచ్చి పడ్డాయి. దాంతో సముద్రం పోటెత్తింది. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులు ఎటు చూసినా ఉండడంతో ఈ రాత్రి గడిస్తే చాలు అని లోతట్టు ప్రాంతాల ప్రజానీకం లంక గ్రామాల ప్రజానీకం కోటి దండాలు పెట్టుకుంటున్నారు. ఇంకో వైపు కరుణించు క్రిష్ణమ్మా అని ఆధ్యాత్మిక పరులు పూజలు చేస్తున్నారు

వరద బీభత్సం అలాగే కొనసాగుతున్న వేళ బెజవాడలో అనేక ప్రాంతాలు పూర్తిగా జన దిగ్బంధంలో చిక్కుకుని పోయాయి. గడచిన అర్ధ శతాబ్ద కాలంలో ఇలాంటి విపత్కరమైన పరిస్థితిని తాము చూడలేదని కూడా జనాలు అంటున్నారు. ఎన్ని సహాయ చర్యలు చేసినా వరద నీరు పోతేనే తప్ప ఉపశమనం కలుగదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే క్రిష్ణా నది వద్ద కరకట్టలు కోతకు తీవ్రంగా గురి అవుతున్నాయి. దాంతో అవేమి ఇబ్బందులు తెస్తాయో అన్న బెంగతో అక్కడి ప్రజానీకం ఉన్నారు

ఇలా చూస్తే కనుక విజయవాడలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోయే పరిస్థితి ఉంది. సముద్రం కనుక శాంతించి తనలోకి వరద నీటిని కలుపుకుంటే ఒకటి రెండు రోజులలో సాధారణ పరిస్థితి ఏర్పడవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా పైన నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం కూడా తగ్గుతుందని అంటున్నారు. ఏది ఏమైనా అమావాస్య గండం మాత్రం గడవాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News