ఐపీఎల్ రోజున బెట్టింగ్ సైట్స్ కు షాక్ ఇచ్చిన కేంద్రం
దేశంలో క్రికెట్ సందడి మొదలైంది. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు రంగం సిద్ధమైంది.;
నేటి నుంచే ఐపీఎల్ సంరంభం.. ఐపీఎల్ తోనే భారీ ఎత్తున బెట్టింగ్, పందేలు సాగుతాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో.. గ్రామాలు, పట్టణాల్లో ఫేవరెట్ టీంలపై అనధికారికంగా భారీగా పందేలు కాస్తారు. ఇలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెట్టింగ్ రాయుళ్లను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఆటగాళ్లకే కాదు.. నిర్వాహకులకు కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
దేశంలో క్రికెట్ సందడి మొదలైంది. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) కొరడా ఝుళిపించింది. ఏకంగా 357 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయడంతో పాటు, వాటికి సంబంధించిన 2,400 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 126 కోట్లను సీజ్ చేసింది. ఈ చర్య ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్ కార్యకలాపాలు ఊపందుకునే సమయంలో చోటు చేసుకోవడం గమనార్హం.
డీజీజీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థలు పన్నులు ఎగ్గొడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డీజీజీఐ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతమైన దర్యాప్తు చేపట్టింది.
ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి వెబ్‌సైట్లు చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని, ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలించినట్లయింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నమెంట్లు జరుగుతున్న సమయంలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.