కన్నబాబుకు అసలు సిసలు పరీక్ష.. ఏం జరిగింది ..!
ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి, కాపు నాయకుడు కురసాల కన్నబాబుకు ఆదిలోనే ఈ ఎఫెక్ట్ పెను ప్రభావం చూపించే అవకాశం ఉందన్న చర్చసాగుతోంది.;
విశాఖలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీకి శరాఘాతంగా మారుతున్నాయి. ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. స్థానిక సంస్థలపై ఆ పార్టీలు కన్నేశాయి. ఇది రాజకీయంగా సహజ ప్రక్రియే. దీనికి ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎవరి రాజకీయం వారిది. అయితే.. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత ఇవతలి పార్టీలపైనే ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ చాలా వరకు నిద్రాణంలో ఉందన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కర్నూలు సహా.. ఇతర స్థానిక సంస్థల్లో వైసీపీ బలం కోల్పోయింది. కొన్ని ఇప్పటికే టీడీపీ పరం అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి దన్నుగా ఉన్న విశాఖ నగర పాలక సంస్థను కూడా దక్కించుకునేందుకు టీడీపీ తన ప్రయత్నా లు తాను చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేయర్ గోలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన క్రతువును కూడా ముందుకు తీసుకువెళ్లాయి. ఆమెపై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ.. కలెక్టర్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు.
ఈ పరిణామాలు వైసీపీలో పెను కుదుపునకు దారితీస్తున్నాయి. గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్న వి. విజయసాయి రెడ్డి విశాఖ నగర పాలక సంస్థలో పాగా వేసేందుకు నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పాదయా త్ర కూడా చేసి విశాఖ వాసులను ఆకట్టుకున్నారు. ఇక, స్థానికంగా నాయకులను కూడా తనవైపు తిప్పుకొని మొత్తానికి టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ పాగా వేసేందుకు అవసరమైన అన్నీ చేశారు. సాధించారు. ఇప్పుడు అలాంటి చోట కూటమి పాగా వేసేందుకు ప్రయత్నాలుచేస్తోంది.
ఇదిలావుంటే.. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి, కాపు నాయకుడు కురసాల కన్నబాబుకు ఆదిలోనే ఈ ఎఫెక్ట్ పెను ప్రభావం చూపించే అవకాశం ఉందన్న చర్చసాగుతోంది. ఆయన ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఒకే ఒక్కసారి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఇంతలోనే విశాఖ కార్పొరేషన్ రూపంలో పెను సమస్య కన్నబాబు మెడకు చుట్టుకుంది. ఇప్పుడు కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాసాన్ని ఎదుర్కొనడంతోపాటు.. మేయర్ పీఠాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో ఏడాది పాటు సమయం ఉన్న నేపథ్యంలో కార్పొరేషన్‌లో వైసీపీ పట్టు చేజార్చుకోకుండా కూడా చూడాల్సిన బాధ్యత కన్నబాబుపైనే ఉండడం గమనార్హం. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.