రేవంత్ కొత్త మంత్రులు వీరే అంటూ ప్రచారం !

ఇక అదిగో ఇదిగో ఆ ఖాళీలు భర్తీ అంటూ ఇంతకాలం గడిపేశారు.;

Update: 2025-03-24 23:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు నిండి పోయాయి. మొత్తం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది దాకా తీసుకునే చాన్స్ ఉంది. కానీ 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఆరు ఖాళీలను ఉంచేసి మిగిలిన వారితో కలసి ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేసారు. ఇక అదిగో ఇదిగో ఆ ఖాళీలు భర్తీ అంటూ ఇంతకాలం గడిపేశారు.

అయితే ఎట్టకేలకు ఆ గడువు దగ్గర పడింది అని అంటున్నారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అని ప్రచారం అయితే ఊపందుకుంది. దానికి తోడు అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలు అంతా ఢిల్లీ చేరుకుని హైకమాండ్ తో భేటీ కావడంతో కొత్త మంత్రుల లిస్ట్ మీదనే ఇదంతా అని చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో ఎవరెవరికి మంత్రులుగా చాన్స్ ఉంది అన్న దాని మీద రకరకాలైన ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. ఉగాది శుభవేళ కాబోయే మంత్రులు వీరే అని కూడా ప్రచారం సాగుతోంది.

ఈ జాబితా చూస్తే కనుక సామాజిక వర్గాల కూర్పుతో ఆరుగురు కొత్త మంత్రులు రేవంత్ రెడ్డి కేబినెట్ లో చేరుతారు అని అంటున్నారు. ముస్లిం మైనారిటీ నుంచి ఒకరు, బీసీల నుంచి ఇద్దరు, ఎస్సీల నుంచి ఒకరికి ఎస్టీస్ నుంచి ఒకరికి, రెడ్డీస్ నుంచి ఒకరికి చాన్స్ దక్కుతుంది అన్నది హస్తిన కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రచారంగా ఉంది.

ఇక బీసీలలో చూస్తే కనుక ఇటీవలనే ఎమ్మెల్సీ అయిన సినీ నటి విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం. ఆమెకు హైకమాండ్ మద్దతు ఉందని అంటున్నారు. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడమే మంత్రి వర్గంలో చోటు కోసం అని అంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ లో మహిళలకు ఫైర్ బ్రాండ్ కి స్థానం ఇచ్చి జనంలో గ్లామర్ ఉన్న వారిని పంపించాలన్న విధానం మేరకే విజయశాంతి పేరు ముందుకు వస్తోంది అని అంటున్నారు.

అదే విధంగా మరో మరో కీలక బీసీ నేతకు మంత్రి పదవి అని అంటున్నారు. ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ నుంచి ఒకరికి చాన్స్ అని అంటున్నారు. అలా చూస్తే కనుక షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఎస్సీల నుంచి గడ్డం వివేక్ కి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. రెడ్డీస్ కోటా నుంచి చాలా మంది పేర్లు వస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారికి పదవి ఇవ్వరని అంటున్నారు.

రంగారెడ్డి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో దానిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు అని అంటున్నారు. దాంతో నిజమాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కాబోయే మంత్రులు ఎవరో తెలుగు వారి కొత్త సంవత్సరం ఎవరి జాతకంలో రాజయోగం ఉందో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News