ఎంపీల జీతాలు పెరిగాయ్ !
ఈ పెరిగిన దానితో ఒక్కో ఎంపీకీ నెలకు లక్షా 24 వేల దాకా జీతం లభిస్తుందని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.;
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మొత్తం పార్లమెంట్ ఎంపీలకు ఒక శుభవార్తను వినిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలకు జీతాలను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా జీతాలు ఎంపీలకు పెరిగిపోయాయి. ఈ పెరిగిన దానితో ఒక్కో ఎంపీకీ నెలకు లక్షా 24 వేల దాకా జీతం లభిస్తుందని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ ని కూడా నెలకు పాతిక వేల నుంచి 31 వేలకు పెంచారు.
గతంలో ఎంపీల నెల జీతం లక్ష ఉంటే ఇపుడు అదనంగా మరో 24 వేల రూపాయలు పెరిగాయన్న మాట. ఇక ఎంపీల రోజు వారీ భత్యం కింద గతంలో రెండు వేలు చెల్లిస్తే ఇపుడు దానిని 2500 రూపాయలకు పెంచారు. ఈ విధంగా పెంచిన జీతాలు భత్యాలు పెన్షన్లు అన్నీ కూడా 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రెండేళ్ళ ముందు నుంచే ఈ పెరిగిన మొత్తాలను ప్రస్తుత ఎంపీలు అందుకుంటారన్న మాట.
వ్యయ ద్రవ్యోల్బన సూచిన ప్రకారం ఎంపీల జీతభత్యాలను కేంద్రం పెంచింది. దీని ప్రకారం ప్రతీ అయిదేళ్ళకూ ఈ విధంగా పెంచాల్సి ఉంటుంది. చివరి సారిగా 2018లో ఎంపీల జీతాలు పెరిగాయి. ఇపుడు మరోసారి ఈ విధంగా పెంచేశారు.
కేవలం జీతాలు మాత్రమే కాదు భత్యాలు అంటే ఎంపీలు తమ నియోజకవర్గం పరిధిలో ప్రజలతో కలసి సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించేందుకు డెబ్బై వేల రూపాయలను భత్యంగా ఇస్తారు. ఇక వీటితో పాటుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే వేళలలో నెలకు అరవై వేల రూపాయలను అలవెన్స్ గా ఎంపీలకు ఇస్తారు. అలాగే ప్రతీ రోజూ సభకు హాజరయ్యేందుకు రెండు వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ తాజా పెరుగుదలతో వీటిలో కూడా పెంపు కనిపిస్తుంది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే జీవిత కాలంలో అయిదేళ్ళ పాటు ఎంపీగా పనిచేస్తే నెలకు లక్షలాది రూపాయలతో పాటు జీవిత కాలమంతా పెన్షన్ అలాగే ప్రయాణ సదుపాయాలలో రాయితీ ఇతర సదుపాయాలలో రాయితీ కలుపుకుని ఎంపీలకు ఈ దేశం చాలానే ఇస్తోంది.
అయితే ఈ జీతభత్యాలు అన్నీ కూడా ఒకపుడు ఆనాటి ఎంపీలకు ఆధారంగా ఉండేవి. ఇపుడు ఎంపీలుగా అత్యధికులు సంపన్నులే వస్తున్నారు. దాంతో ఈ జీతాల పెంపు అవసరమా అన్న చర్చ కూడా ఉంది. ప్రజా సేవకు జీతాలు ఎందుకు అన్నది నెటిజన్లతో పాటు మేధావుల మాటగా ఉంది. కానీ ఎంపీలు అందరి స్థితిగతులు ఒకే విధంగా ఉండవు కాబట్టి ఈ జీతాలు భత్యాలు అవసరం అయిన వారూ ఉంటారని అంటున్నారు.
ఏది ఏమైనా క్రమం తప్పకుండా ప్రతీ అయిదేళ్ళకు ఎంపీలకు ప్రజా ప్రతినిధులకు జీతభత్యాలు పెంచడం మంచి విధానమే అయినా ప్రజలకు కూడా వ్యయ ద్రవ్యోల్బణ సూచిక మేరకు పెంచాల్సినవి పెంచితేనే సమాజంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడేవారు తగ్గుతారు అని అంటున్నారు. ఇక ఎంతో బాధ్యత కలిగిన అత్యున్నత చట్ట సభ సభ్యులు ప్రజా సమస్యల మీద చర్చించి మేలైన సమాజం కోసం పాటుపడాలని కూడా సూచనలు వస్తున్నాయి.