కుక్కల పోటీ చూసేందుకు ఉషా వాన్స్.. నిప్పులు చెరిగిన గ్రీన్ ల్యాండ్
రెండు నెలల కిందట అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉషా భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు అయిన సంగతి తెలిసిందే.;
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కాకమునుపు నుంచి ఒకటే పట్టు పట్టాడు.. అదే గ్రీన్ ల్యాండ్ ద్వీపాన్ని తాము కొంటామని.. డెన్మార్క్ ఆధీనంలో స్వయం ప్రతిపత్తితో ఉన్న ఈ ద్వీపాన్ని తాము ఇవ్వము పో అన్నప్పటికీ ట్రంప్, ఆయన కార్యవర్గం మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ట్రంప్ ప్లాన్లు చూస్తుంటే గ్రీన్ ల్యాండ్ ను వదిలేదు లేదు అన్నట్లుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్ష కార్యవర్గంలోని కీలక అధికారులు, సెకండ్ లేడీ తెలుగింటి ఉషా వాన్స్ గ్రీన్ ల్యాండ్ లో అడుగుపెట్టారు.
రెండు నెలల కిందట అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉషా భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఉషా అమెరికా సెకండ్ లేడీ అయ్యారు. బహుశా ఆమె తొలి విదేశీ పర్యటనగా గ్రీన్ ల్యాండ్ లో కాలుపెట్టబోతున్నారు. అదీ అనధికారికంగా. కానీ, ఈ పర్యటనపై గ్రీన్ ల్యాండ్ మండిపడుతోంది. అమెరికాది దుందుడుకు చర్య అని గ్రీన్ ల్యాండ్ ప్రధాని మూట్ బి ఎగీడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాపై బలప్రదర్శనే..
ఉషానే కాదు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్ట్జ్ సైతం గ్రీన్ ల్యాండ్ లో టూర్ చేయనున్నారు. దీంతో ఆ దేశ ప్రధాని మూట్ కు కోపం నషాళానికి ఎక్కింది. ఇది తమపై బల ప్రదర్శనే అని నిప్పులు చెరిగారు. గ్రీన్ ల్యాండ్ లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇందులో ఫ్రెడ్రిక్ నీల్సన్ గెలిచారు. అమెరికా ఉన్నత స్థాయి టీమ్ టూర్ చేయడాన్ని ఆయన తమ దేశంపై ఉన్న చిన్న చూపుగా అభివర్ణించారు.
కుక్కల పోటీలు చూసేందుకట..
గ్రీన్ ల్యాండ్ పై అదుపు ఉన్న డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ మాట్లాడుతూ.. అమెరికా ప్రతినిధి బృందం పర్యటనను తాము తీవ్రంగానే చూస్తామని పేర్కొన్నారు. కాగా గ్రీన్ ల్యాండ్ ఎక్కువ శాతం మంచుతో కప్పి ఉండే దేశం. ఇక్కడ జరిగే సంప్రదాయ డాగ్ స్లెడ్ రేస్ చూసేందుకే ఉషా వెళ్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. పనిలో పనిగా గ్రీన్ ల్యాండ్ సంప్రదాయాలను ఉషా తెలుసుకుంటారని చెప్పడంతో ఆందోళన మొదలైంది.
గ్రీన్ ల్యాండ్ భద్రత, విదేశాంగం, ద్రవ్య పరపతి విధానాలను డెన్మార్క్ చూస్తుంటుంది. మిగతా అంశాలన్నిటిలో గ్రీన్ ల్యాండ్ దే అధికారం. అయితే, రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచే గ్రీన్ ల్యాండ్ లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. అప్పటి సోవియట్ యూనియన్, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో తరఫున అమెరికా దీనిని నిర్వహిస్తోంది. విపరీతమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలు ఉండడంతో గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్నేశారు.