కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం.. షాకింగ్ వీడియో
జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 120 అడుగుల ఎత్తైన రథాన్ని తాళ్ల సహాయంతో పైకి లేపుతుండగా ప్రమాదం జరిగింది.;
బెంగళూరు సమీపంలోని అనేకల్ తాలూకా హస్కూరులో జరుగుతున్న ప్రసిద్ధ మద్దూరమ్మ జాతరలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన 120 అడుగుల భారీ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హస్కూరులో ప్రతి సంవత్సరం మద్దూరమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు తరలివస్తారు. జాతరలో భాగంగా భారీ రథాలను అలంకరించి ఊరేగించడం ఇక్కడి ఆచారం. ఈ సంవత్సరం కూడా జాతర కోసం గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఊరేగింపు కోసం నాలుగు రథాలను సిద్ధం చేశారు. ఈ రథాలను ట్రాక్టర్లు , ఎద్దుల సహాయంతో లాగడానికి సన్నాహాలు చేశారు.
జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 120 అడుగుల ఎత్తైన రథాన్ని తాళ్ల సహాయంతో పైకి లేపుతుండగా ప్రమాదం జరిగింది. రథాన్ని పైకి లేపుతున్న సమయంలో తాళ్లపై పట్టు కోల్పోవడంతో అది ఒకవైపు ఒరిగిపోయింది. క్షణాల్లోనే భారీ శబ్దంతో రథం నేలపై కుప్పకూలింది. ఈ హఠాత్ పరిణామానికి భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. రథం కూలిన సమయంలో దాని సమీపంలో ఎక్కువ మంది భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, రథం కూలిన దృశ్యం అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.ఏదైనా అపశకునం జరిగిందా? అని పూజారులు శాంతిపూజలు చేశారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించాల్సి ఉంది. రథం కూలడానికి గల కారణాలపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేసింది.