పోసాని విడుదల.. ఇక విడదల.. వైసీపీలో టెన్షన్
ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి రజినిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకున్న అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.;
వైసీపీ నేతలను కేసులు వదలడం లేదు. విడతల వారీగా వంతుల వారీగా కేసులు, అరెస్టులతో ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి బెయిల్ పై విడుదలయ్యేరని సంతోషిస్తున్న లోపే వైసీపీకి ప్రభుత్వం మారో షాక్ ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితోపాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడదల గోపి, పీఏ రామక్రిష్ణపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదైంది. 2020లో ఈ ఉదంతం చోటుచేసుకోగా, గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన వెంటనే బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని తాజాగా ఏసీబీ కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి రజినిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకున్న అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. తన నియోజకవర్గం పరిధిలో వ్యాపారం చేసుకోవాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాల్సిందిగా అప్పట్లో మంత్రిగా ఉన్న రజిని బెదిరించారని బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. అన్ని అనుమతులు ఉన్న తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని బాధితుడు ఎదురుతిరగగా, అప్పట్లో గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాను పంపి రూ.50 కోట్ల అపరాధ రుసుం విధిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. జాషువా బెదిరింపులతో తాను రూ.2 కోట్లు విడదల రజినికి, చెరో రూ.పది లక్షలు చొప్పున విడదల మరది గోపి, ఎస్పీ జాషువాకు ఇచ్చినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో అధికార దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలపై మాజీ మంత్రి విడదల రజినితోపాటు ఐపీఎస్ అధికారి జాషువాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీలో మరో టెన్షన్ మొదలైంది.