బీఆర్ఎస్-కాంగ్రెస్ బహిరంగ కాపురం: కిషన్‌రెడ్డి
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు.;
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్-కాంగ్రెస్‌లు నిన్న మొన్నటి వరకు తెరచాటు కాపురం మాత్రమే చేశాయని అందరూ అనుకున్నారని.. ఇప్పుడు బహిరంగ కాపురం మొదలు పెట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో వీరి సంగతి బట్టబయలు అయిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఏదో జరిగిపోతున్నట్టు ఈ రెండు పార్టీలూ మొసలి కన్నీరు కారుస్తున్నాయని వ్యాఖ్యానించారు.
తమ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల మధ్య చర్చకు రాకుండా చేసుకునేందుకు డీఎంకే(తమిళనాడు అధికార పార్టీ) చేసిన ప్రయత్నంలో వీరంతా భాగస్వాములు అయ్యారని ఇతర పార్టీ లపైనా కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ విషయానికి వస్తే.. బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు ఆది నుంచి చేతులు కలిపి రాజకీయాలుచేస్తున్నాయని.. బీజేపీ తరఫునమొదటి నుంచి తాము చెబుతున్నామన్నారు. ఇప్పుడు అది నిజమైందని వ్యాఖ్యానించారు.
దేశంలో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టలేదని కిషన్ రెడ్డి చెప్పారు. అయినా.. ఇప్పుడే ఏదో జరిగిపోతున్నట్టు ఆయా పార్టీలు శోకాలు పెడుతున్నాయని దుయ్యబట్టారు. డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ విధానాన్నే అనుసరించి.. పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉందని అయినా.. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.
పునర్విభజన చేసినా.. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర ప్రభుత్వం చెబుతు న్న విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని.. అక్కడి డీఎంకే నాయకులు దోచుకో-దాచుకో అన్నట్టుగా పాలన సాగిస్తున్నారని.. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాట కుటుంబ, కుంభకోణాల పాలన నిర్విఘ్నంగా జరుగుతోందని, దీనికి బీజేపీ అడ్డుకట్ట వేయనుందని అందుకే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోసం తహతహ లాడుతోందని దుయ్యబట్టారు.