గ్రామాల ఘోష.. బాబు చెప్పాలట!
ఈ సమయంలో పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఉన్నతాధికారులపైనే ఉంటుంది.;
ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. నిజానికి వేసవి ప్రారంభం నుంచే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఫలితంగా ఇప్పటికే కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, అనంతపురం, గుంటూరులో ని పల్నాడు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తారస్థాయిలో పెరిగింది. గుక్కెడు నీటి కోసం.. ప్రజలు బారులు తీరుతున్నారు. చెలమల కోసం.. కిలో మీటర్ల కొద్దీ దూరం ప్రయాణిస్తూ.. మహిళలు నానా తిప్పలు పడుతున్నారు.
ఇక, గుంటూరు, కర్నూలు పట్టణాల్లోనూ సామాన్యుల పరిస్థితి దారుణంగా దుర్భరంగా మారిపోయింది. మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కారు. ఫలితంగా.. గ్రామాలు చుక్కనీటి కోసం రోడ్డెక్కి నిరసన లు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఉన్నతాధికారులపైనే ఉంటుంది. కానీ, ఎక్కడికక్కడ అదికారులు నిద్రాణంలో ఉన్నారు. ఎవరిని కదిపినా.. ఈ సమస్య సీఎం దృష్టికి వెళ్లలేదని చిత్రమైన సమాధానాలు చెబుతున్నారు.
``సీఎంగారు చెప్పలేదండీ`` అని గుంటూరుకు చెందిన ఉన్నతాధికారులు మీడియా ముందే వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాగునీటి సమస్య అనేది స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నుంచిఆయా సంస్థలు తప్పించుకున్నారు. ఫలితంగా కలెక్టర్లు పట్టించుకుని ప్రజలకు తాగు నీరు అందించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు వారు చెబుతున్నారు.
దీంతో ప్రజలకు తాగునీరు మరింత సమస్యగా మారిపోయింది. పైగా.. సీఎం చెప్పాలంటూ.. ఉన్నతాధికా రులే సెలవిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మిగిలిన అధికారులు మరింతగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితి.. సర్కారుకు బ్యాడ్ నేమ్ తెస్తుండడం గమనార్హం. మరి అధికారులు తమంతట తామే పరిష్కరిస్తారో.. సీఎం జోక్యం చేసుకునే వరకు ఎదురు చూస్తారో చూడాలి.