ఓన్లీ పొలిటికల్ యాక్షన్ : మహానాడు కేరాఫ్ పులివెందుల
పులివెందులలో మహానాడు కోసం సరైన స్థలాన్ని అన్వేషించాలని క్యాడర్ కి ఇప్పటికే సమాచారం వెళ్ళిందని టాక్ నడుస్తోంది.;
నాలుగు సార్లు సీఎం. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. కనీ వినీ ఎరుగని రికార్డులతో దక్కిన సీట్లు ఇదీ టీడీపీ రాజకీయ రాజసం. ఇక వైసీపీ 151 సీట్లతో బలంగా ఉండి 2019 నుంచి 2024 వరకూ సవాల్ చేస్తూ పసుపు శిబిరాన్ని కకావికలు చేయాలని చూసింది. వాటన్నింటినీ తట్టుకుని టీడీపీ బలంగా నిలబడింది. ఇక తిరుగు లేదన్నట్లుగా తలెత్తుకుని నిలబడింది.
మరి ఇంతటి అద్భుతమైన విజయం దక్కాక దానిని ప్రత్యర్ధి ఇలాక్లో రీ సౌండ్ చేసేలా ఉత్సవాన్ని చేసుకోకుంటే దానికి అర్ధం పరమార్ధం ఏముంటుంది. పక్కా మాస్ గా చెప్పాలంటే ఆ కిక్కు ఏముంటుంది. అందుకే అధికారం దక్కాక తెలుగుదేశం చేసుకునే మహానాడు పార్టీ పండుగకు వేదిక మొదట కడప జిల్లాను ఎంచుకున్నారు. ఇపుడు మరి కాస్త రాజకీయ మసాలా జోడిస్తూ వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందులలోనే టీడీపీ మహానాడు నిర్వహించాలని అనుకుంటున్నారట.
పులివెందులలో మహానాడు పెట్టి లక్షలాది మంది జనాలతో పసుపు పార్టీ పండుగ చేస్తే ప్రత్యర్థి పార్టీ గుండెలలో రైళ్ళు పరిగెడుతాయని అంచనా వేస్తున్నారు. దాంతో పాటు పులివెందుల సహా మొత్తం కడప జిల్లా వైసీపీ అడ్డా కాదు అని చాటి చెప్పడం ద్వారా సొంత క్యాడర్ కి నైతిక స్థైర్యం ఇవ్వాలని కూడా భావిస్తున్నారు.
పులివెందులలో మహానాడు కోసం సరైన స్థలాన్ని అన్వేషించాలని క్యాడర్ కి ఇప్పటికే సమాచారం వెళ్ళిందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే కడపలో మొదట భారీ ఎత్తున మహానాడుని నిర్వహించాలని అనుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక కడప జిల్లాలో మహానాడు పెట్టలేదు. దాంతో పాటు టీడీపీకి గతంలో ఎన్నడూ కడప జిల్లాలో రాజకీయంగా కలసి రాలేదు.
కానీ ఈసారి కూటమితో కలుపుకుని మొత్తం పది అసెంబ్లీ సీట్లకు గానూ ఏడు సీట్లను గెలుచుకుంది. 2019లో పది సీట్లను గెలుచుకున్న వైసీపీని మూడుకు పరిమితం చేసింది. దాంతో ఆ పట్టుని రాజకీయంగా నిలుపుకోవడంతో పాటు వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలనే కడపను ఎంచుకున్నారు.
కడప నగరంలో నాలుగు అనువైన స్థలాలను కూడా మహానాడు కోసం ఎంపిక చేశారు. వాటిని అధినాయకత్వానికి పంపించారు. అయితే హైకమాండ్ ఆలోచనలు ఇంతలో మారాయట. పులివెందులలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న యాంగిల్ లో ఇపుడు కొత్తగా ఆలోచిస్తున్నారుట.
మహానాడుతో వైసీపీని జగన్ సొంత నియోజకవర్గంలోనే గట్టిగా నిలువరించాలనందే ఇపుడు టీడీపీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. దాంతో ప్లేస్ కడప నుంచి పులివెందులకు మారడంతో మే నెలలో నిర్వహించే మహానాడు ఏ రకమైన పొలిటికల్ సమ్మర్ ని క్రియేట్ చేస్తుందా అన్న చర్చ అంతటా వినిపిస్తోంది. మహానాడు మూడు రోజుల తెలుగుదేశం పార్టీ పండుగ.
గెలుపు జోష్ లో ఉన్న టీడీపీ పులివెందులలోనే మహానాడుని నిర్వహించి సవాల్ చేస్తే దానిని వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. మహానాడు కేరాఫ్ పులివెందుల అన్నది పొలిటికల్ గా వినడానికే తట్టుకోలేని వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సో పులివెందులను ఫిక్స్ చేస్తే మాత్రం ఇక మాటలు ఉండవు, ఓన్లీ పొలిటికల్ యాక్షన్ మాత్రమే రాజకీయ తెర మీద చూడాల్సిందే. సో ఏమి జరుగుతుందో వెయిట్ చేయాల్సిందే.