యాదాద్రి 'కింద కూర్చున్న' వివాదంపై స్పందించిన 'భట్టి'.. సంచలన కామెంట్స్
తాను కూర్చున్న విధానంలో ఎవరి ప్రోద్బలం లేదని తాను కావాలనే అలా కూర్చున్నానని సమాధానం ఇచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో తాను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని ఇందులో ఎలాంటి బలవంతం లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తన మీద సోషల్ మీడియాలో అనవసర ట్రోలింగ్ లు పెడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్న విధానంపై మండిపడ్డారు. కావాలనే దురుద్దేశంతో తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాను కూర్చున్న విధానంలో ఎవరి ప్రోద్బలం లేదని తాను కావాలనే అలా కూర్చున్నానని సమాధానం ఇచ్చారు.
ఇతర పార్టీల నేతలు మాపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ దురుద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు. ఆత్మగౌరవంతో బతికే వాడిని. నాకు గౌరవం అంటే ఏంటో తెలుసు. కూర్చోవడానికి స్థలం లేనప్పుడు ఎక్కడ కూర్చున్నా తప్పులేదు. అంతేకాని అందులో కూడా లోపాలు వెతుకుతూ లేనిపోని పెడర్థాలు చూపిస్తూ రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు.
పనుల విషయంలో లోపాలు చూడాలని కానీ ఇలా కూర్చుండే పద్ధతుల్లో కూడా చౌకబారు మాటలు మాట్లాడటం వారి స్థాయికి తగదని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న పనులను చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పనుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సూచిస్తే సరిచేసుకుంటాం. కానీ వ్యక్తిగత విషయాల్లో కూడా వారి బలహీనతలు ప్రదర్శించడం వారికి తగదని చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఉపముఖ్యమంత్రిగా తన గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ కూడా తాను తలొగ్గి ప్రవర్తించలేదని తేల్చారు. ఉపముఖ్యమంత్రిగా మూడు శాఖలను సమన్వయం చేస్తున్నానన్నారు.
సింగరేణి సంస్థను బలోపేతం చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామన్నారు. వారు చేయలేని పనులు తాము చేసి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలిచి వారికి కావాల్సిన సదుపాయాలు తీరుస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశాం. ఇక మిగిలిన వాటిని కూడా త్వరలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.