ఇది భూమా అఖిలప్రియ 'రెడ్ బుక్'

ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-09-07 04:15 GMT

ముందు వెనుకా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నేతల సంఖ్య కూటమి ప్రభుత్వంలో ఎక్కువ కానున్నారా? అంటే అవునన్న మాట తాజాగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు.. నారా లోకేశ్ రెడ్ బుక్ పేరుతో చేసిన సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం జోరు తగ్గించారు. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ.. లోకేశ్ స్ఫూర్తితో పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం రెడ్ బుక్ అంటూ హడావుడి చేస్తున్నారు.

ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓపెన్ గానే ఆమె తన రెడ్ బుక్ గురించి చెప్పేశారు. రానున్న రోజుల్లో తాను రాసుకున్న రెడ్ బుక్ కారణంగా 100 మంది ఇబ్బంది పడనున్నట్లుగా తేల్చేశారు. మీడియాలో మాట్లాడిన సందర్భంగా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. సంచలనంగా మారాయి.

"నాకు ఒక రెడ్ బుక్ ఉంది. అందులో వంద మందికి పైగా వైసీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు.. ముగ్గురిని వదిలేస్తున్నా. కానీ.. వంద మందిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్ఛితంగా ఇబ్బంది పడుతున్నారు. వారి పేర్లు నా రెడ్ బుక్ లో ఉన్నాయి"అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు. ఆళ్లగడ్డలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టనని ఎప్పుడైనా చెప్పానా? అని ప్రశ్నిస్తున్న ఆమె.. తాము అధికారంలోకి వస్తే తోలు తీస్తామని చెప్పాము కదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తానేం మంచిదానిని కాదని.. తాను మంచితనం చూపిస్తానని ఎప్పుడైనా చెప్పానా? అంటూ ప్రశ్నించిన భూమా అఖిలప్రియ.. తానుమంచి పద్దతిలో పోతానని మాత్రం అనుకోవద్దంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలాంటి దూకుడు వ్యాఖ్యలకు బాబు బ్రేకులు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి మాటల కోసమే కాచుకొని కూర్చునే రాజకీయ ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పడేయటం ఖాయమంటున్నారు. భూమా అఖిలప్రియ రెడ్ బుక్ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చి.. మౌనంగా ఉంటే మంచిదంటున్నారు. మరి.. బాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు