అమెరికా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. మారుతున్న పల్స్

మరోవైపు.. ఎన్ఆర్ఐలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Update: 2024-10-15 09:28 GMT

రోజురోజుకూ అమెరికా ఎన్నికల రేసు రసవత్తరంగా మారుతోంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారుగా దూసుకెళ్తున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టి వస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కీలక డిబేట్ కూడా నిర్వహించారు. మరోవైపు.. ఎన్ఆర్ఐలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మినీ సమావేశాలు, చర్చలతో దూసుకెళ్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలదీ ట్రెండింగ్ మారుతున్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి వరకు ప్రెసిడెంటుగా హారిస్ విజయం ఖాయమని ప్రచారం జరిగింది. పలు సర్వే సంస్థలు కూడా అదే తేల్చాయి. కమలాకే అవకాశాలు ఉన్నాయని నిర్ధారించాయి. అటు ప్రముఖ మీడియా సంస్థ డిబేట్‌లోనూ ట్రంప్‌పై కమలానే పైచేయి సాధించినట్లుగా వెల్లడించాయి. ఈ క్రమంలో హారిస్ గెలుపు సునాసయమనే అంతా భావించారు. సమయం గడుస్తున్న కొద్దీ ఫలితాలు మారుతున్నట్లు సర్వే సంస్థలు మరోసారి వెల్లడించాయి.

తాజాగా.. సర్వే ప్రకారం ట్రంప్ పుంజుకున్నట్లుగా చెప్పాయి. పది రోజుల్లో పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో కమలా హారిస్ విజయావకాశాలు, ఆధిక్యం నాలుగు శాతం నుంచి రెండు శాతానికి తగ్గిపోయినట్లు ది గార్డియన్ తెలిపింది. అమెరికా ఎన్నికల్లో 19 రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. అందులోనే ఏడు రాష్ట్రాలు మరింత కీలకం. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈ ఏడు రాష్ట్రాలే దేశ అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. దీంతో ఇప్పుడు అక్కడ తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా రాష్ట్రంపై ఇరు పార్టీల అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇక్కడ అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండడమే ఇందుకు కారణం. అరిజోవా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విష్కాన్సిన్ రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ఇక్కడ ఎవరు పైచేయి సాధిస్తే వారిదే గెలుపు అనేది మొదటి నుంచి ఉన్న సెంటిమెంట్. అయితే.. ఈ రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. దీంతో కమలా హారిస్ శిబిరం ఒక్కసారిగా ఆందోళనలో పడింది. కేవలం మూడు రాష్ట్రాల్లోనే హారిస్ ముందంజలో ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. మిగితా రాష్ట్రాల్లో ట్రంప్‌నకు స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నట్లు తెలిపాయి.

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండడం.. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరిగింది. ఇమ్మిగ్రేషన్ సమస్యలు కూడా అధికం అయ్యాయి. ఈ పరిణామాలన్నీ కూడా డెమొక్రటిక్ పార్టీకి ఇప్పుడు గుదిబండలా మారాయి. యుద్ధాన్ని కట్టడి చేయకుండా.. ఇజ్రాయెల్‌ను మరింత ప్రోత్సహిస్తుండడంతో ఇప్పుడ ఆ ప్రభావం కాస్త అమెరికా ఎన్నికలపైనా చూపుతోంది. వీటినే ప్రధాన అస్త్రాలుగా చేసుకున్న ట్రంప్.. ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News