నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన బ్రిడ్జ్... వీడియో వైరల్!

ఎప్పుడో 2015లో మొదలుపెట్టిన బ్రిడ్జ్.. దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించారు.

Update: 2024-08-17 07:32 GMT

ఎప్పుడో 2015లో మొదలుపెట్టిన బ్రిడ్జ్.. దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణం ఇప్పటికీ పూర్తవలేదు సరికదా ఇప్పటికి మూడుసార్లు కూలింది. కూలిన ప్రతీసారి స్థానికంగా ఉన్న వారు వీడియో తీయడం, అది కాస్తా నెట్టింట వైరల్ గా మారడం పరిపాటిగా మారింది! దీంతో ఈ ప్రాజెక్ట్ నాణ్యతపై తీవ్ర విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

అవును... బీహార్ లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అలా అని ఇలా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇది మూడోసారి! ఇక ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా డిస్ట్రిక్ట్ లో గంగానదిపై అగువాని సుల్తాన్ గంజ్ గంగా పేరుతో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు.

ఖగారియా - అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 2015లోనే నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో బీహార్ ప్రభుత్వం దీని నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. ఈ నిర్మాణ బాధ్యతల్లు ఎస్.కే. సింగ్లా కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది.

అలా 2020 నాటికే పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణం ఇప్పటివరకూ పూర్తికాలేదు సరికదా.. నిర్మాణంలో ఉండగానే మూడోసారి కుప్పకూలింది. దీంతో... దీని నాణ్యతపై విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం... ఈ వంతెనను సొంత ఖర్చుతోనే నిర్మించాలని కనస్ట్రక్షన్ కంపెనీని ఆదేశించింది.

కాగా గత ఏడాది ఏప్రిల్ లో తుఫాను కారణంగా ఈ వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇలా బీహార్ లో వంతెనలు కుప్పకూలిపోతుండటం సర్వసాధారణమైపోయింది. ఇందులో భగాంగా... 2022లో బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలో బుర్హి గండక్ నదిపై నిర్మించిన వంతెనలో కొంతభాగం కూలిపోయింది.

అదే ఏడాది నవంబర్ లో సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలోనూ నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూపిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. అంతక మూందు సహర్సా, కిషన్ గంజ్ జిల్లాల్లోనూ రెండు వంతెనలు ప్రారంభానికి ముందే కూలిపోయాయి.

ఈ నేపథ్యంలో తాజాగా అగువాని సుల్తాన్ గంజ్ గంగా బ్రిడ్జ్ మూడో సారి కూలింది. ఈ వంతెన కూలుతున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News