జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు

తాడేపల్లిగూడెంలోని మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

Update: 2024-09-22 08:29 GMT

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. లడ్డూ ప్రసాదంలో అపచారం చోటుచేసుకున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుండడంతో అన్నివర్గాల్లోనూ ఆగ్రహం కనిపిస్తోంది. దోషులను వదలకుండా.. మరోమారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ దుర్ఘటనపై ప్రపంచవ్యాప్తంగా హిందూలోకం గొంతెత్తుతోంది. తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేశారని.. తిరుమల గొప్పతనాన్ని దెబ్బతీశారని నిలదీస్తున్నారు. రాజకీయ పరంగానూ అన్ని పొలిటికల్ లీడర్ల నుంచి వాయిస్ వినిపిస్తోంది. తాజాగా.. బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

తాడేపల్లిగూడెంలోని మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దాంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

కాగా.. ఇప్పటికే లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సరైన విధంగా విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అటు.. అగ్రనేత అమిత్ షా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. తాజాగా.. జగన్ నివాసాన్ని ముట్టడించారు.

Tags:    

Similar News