మోడీషాలకే తల ఎగరేసిన సొంత పార్టీ ఎంపీలు!
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీని కాదని.. అందునా మోడీషాలను ధిక్కరించే పరిస్థితి లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీని కాదని.. అందునా మోడీషాలను ధిక్కరించే పరిస్థితి లేదు. అందుకు కాంగ్రెస్ లాంటి కొద్ది పార్టీలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మోడీషాల విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సైతం కేంద్రంతో కయ్యం పెట్టుకోవాలని అనుకోవటం లేదు. సామరస్య ధోరణితో పనులు పూర్తి చేసుకోవాలన్న తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.
ఇలాంటి వేళ.. సొంత పార్టీకి చెందిన ఎంపీలు తల ఎగురవేస్తే? అన్నది ప్రశ్న. అలాంటి పరిస్థితి ఉందా? అన్న సందేహం కలుగుతుంది. కానీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. విస్మయానికి గురయ్యేలా ఉంటాయి. కీలకమైన జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టే వేళలో.. బీజేపీకి చెందిన 20 మంది ఎంపీలు గైర్హాజరు కావటం ఇప్పుడు హాట్ టాపిక గా మారింది. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే బీజేపీలో.. మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిల్లు సభలో ప్రవేశ పెట్టే వేళలో.. సభకు రాకుండా దూరంగా ఉండటమా? అన్నది ప్రశ్నగా మారింది.
జమిలి బిల్లును సభలోకి అనుమతించాలా? వద్దా? అన్న అంశంపై విపక్షాలు ఓటింగ్ కు కోరటం.. ఓటింగ్ నిర్వహించారు. ఈ సమయంలో వచ్చిన ఫలితాల్ని చూస్తే.. అధికార పక్షానికి.. విపక్షానికి మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉంది. ఎందుకిలా అంటే.. బీజేపీకి చెందిన 20 మంది ఎంపీలు సభలో లేకపోవటమే. నిజానికి.. సోమవారం సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ విప్ జారీ చేసిన తర్వాత కూడా చాలా మంది ఎంపీలు హాజరు కాకపోవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. గైర్హాజరు అయిన 20 మంది ఎంపీల్లో కొందరు తాము సభకు రాలేమన్న విషయాన్ని ముందుగానే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ రాజస్థాన్ లో ప్రధాని మోడీ పర్యటన కారణంగా హాజరు కాలేదు. మిగిలిన వారిలో పలువురు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాజరు కాకపోవటంపై పార్టీ ఇప్పుడు సీరియస్ గా ఉంది. ఇంకో వైపు ఎన్డీయే కూటమికి చెందిన కొందరు ఎంపీలు కూడా రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పార్టీ ఎంపీలకు క్రమశిక్షణ నేర్పాల్సిన సమయం ఆసన్నమైందన్న మాట వినిపిస్తోంది. మరి.. వీరి విషయంలో మోడీషాలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.