లడ్డూ ఇష్యూ : బీజేపీ పెద్దల మౌనం వెనక ?

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ అన్నది అతి పెద్ద సంచలనంగా మారింది.

Update: 2024-10-01 15:33 GMT

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ అన్నది అతి పెద్ద సంచలనంగా మారింది. ఏకంగా ప్రపంచాన్ని కుదిపేసింది. జాతీయ మీడియాకు రోజుల తరబడి బిగ్ కంటెంట్ గా కూడా మారింది. శ్రీవారి లడ్డూ కల్తీ అయింది అని ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన భక్తులకు షాకింగ్ గా మరింది. అదే సమయంలో ఏపీలో ఏమి జరుగుతోంది అని హిందూ సంస్థలు కూడా దృష్టి పెట్టాయి.

ఉపచారాలలో అపచారాలు జరగడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రోజుల తరబడి ఈ ఇష్యూ సాగినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు మౌనంగానే ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ మీద బాబు ప్రకటన చేసిన మీదట కేంద్ర మంత్రి జాతీయ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బాబుతో ఫోన్ లో మాట్లాడారు, వివరాలు అన్నీ ఏపీ సీఎం నుంచి తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు.

ఆ తరువాత ఈ ఇష్యూ కేంద్ర స్థాయిలో మరింతగా సీరియస్ గా మారి ఏదో జరుగుతుందని అంతా అనుకున్నారు. దానికి తోడు అన్నట్లుగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు సీబీఐ విచారణ జరిపించమని అందులో కోరారు. లడ్డూ ప్రసాదం కల్తీ కాకుండా తిరుమలలో టెస్టింగ్ చేసే మెకానిజం ఉందని మూడు దశలుగా టెస్టింగ్ పాయింట్లను దాటుకుని నెయ్యి వంటశాలకు చేరుతుందని కూడా ఆయన అందులో పేర్కొన్నారు

ఇక లడ్డూ ఇష్యూ పీక్స్ కి చేరుకున్న వేళ ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తరువాత దీని మీద ఫోకస్ పెడతారు అని అనుకున్నారు. కానీ హర్యానా కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలోనే ఆయన బిజీ అయ్యారు.

ఇక కేంద్రంలో నంబర్ టూగా ఉన్న అమిత్ షా కూడా ఈ విషయం మీద జేపీ నడ్డా నుంచి సమాచారం తెప్పించుకుని ఉంటారని అంటున్నారు. ఆ మీదట చూస్తే కనుక కెంద్ర పెద్దలు అయితే పెద్దగా బయటకు రియాక్ట్ కాలేదు. ఇపుడు సుప్రీంకోర్టు శ్రీవారి లడ్డూల విషయంలో సమగ్ర దర్యాప్తు చేయడానికి ఏమి చేయాలన్న దాని మీద సొలిసిటర్ జనరల్ ని అడిగింది.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెప్పాలనుకుంటో వెల్లడించాలని కోరింది. మరి శ్రీవారి లడ్డూ ఇష్యూలో కేంద్ర బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది ఈ నెల 3న సుప్రీం కోర్టులో సొలిసిటర్ జనరల్ ఇచ్చే సమాధానం ద్వారా తేటతెల్లం అవుతుంది అని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సిట్ విచారణ జరిగితే వాస్తవాలు బయటకు రావు అని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఎందుకంటే సీఎం ముందే లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అని తేల్చేస్తూ ప్రకటన చేశారు. దానిని దాటుకుని సిట్ ఏ విధంగా వేరే రకమైన ప్రకటన చేయగలదు అన్న చర్చ కూడా ఉంది.

దాంతో తటస్థ దర్యాప్తు సంస్థతో లడ్డూ ప్రసాదం విషయంలో చేసేందుకు కేంద్రం ముందుకు వస్తుందా అన్న చర్చ ఉంది. సుప్రీంకోర్టు ఏపీ ముఖ్యమంత్రి మీద అలాగే లడ్డూ ఇష్యూ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలను సైతం కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే సిట్ కంటే బెటర్ అయిన విచారణకే మొగ్గ్గు చూపే అవకాశాలే ఉంటాయని అంటున్నారు.

ఇక ఇది కేవలం ఏపీకే పరిమితమైన అంశం కాదు, దేశంలోని కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. అందుకే సీబీఐ కి ఈ విచారణను అప్పగించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఇంకో వైపు చూస్తే మంత్రి స్వామి అయితే సీబీఐ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదని లడ్డూలో కల్తీ జరిగింది అని అంటున్నారు. లడ్డూ ప్రసాదంలో వాస్తవాలను పక్కన పెడితే రాజకీయమే ఎక్కువగా నడిచింది అన్న భావన ఏమైనా కేంద్ర పెద్దలలో ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏది ఏమైనా మొదట్లో పూర్తి వివరాలు ఏపీ సీఎం ని అడిగి తెలుసుకున్న నడ్డా ఆ తరువాత నుంచి పెద్దగా హడావుడి చేయలేదు. ఈ విషయంలో కేంద్రం వద్ద అన్ని వివరాలూ ఉన్నాయని కూడా అంటున్నారు మొత్తం మీద చూస్తే సీబీఐ విచారణ జరిగితే జగన్ డిమాండ్ నెరవేరినట్లు అవుతుంది. అలాగే న్యాయ విచారణ జరిగితే సుబ్రమణ్య స్వామి వైవీ సుబ్బారెడ్డిల పిటిషన్లకు న్యాయం జరిగినట్లుగా భావించాలి అన్న చర్చ ఉంది. ఏది జరుగుతుంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఇస్తుంది అన్నది ఈ నెల 3న తేలనుంది.

Tags:    

Similar News