పార్లమెంటులో జరుగుతున్న 'పొలిటికల్ చిత్రం' చూశారా?!
మహిళలపై జరిగిన అమానవీయ ఘటనల అంశం
ఈ నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. చర్చకు తాము సిద్ధమేనని చెబుతున్న బీజేపీ.. అదే చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు.. మరి ఇక కావాల్సిందేంటి? అటు చర్చకు సిద్ధమని చెబుతున్న అధికార పక్షంతో కాంగ్రెస్ ఎందుకు చర్చించడం లేదు. ఇటు, చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్‌తో బీజేపీ ఎందుకు సహకరించడం లేదు.. ఇదీ.. ఇప్పుడు పార్లమెంటు సంగతులపై ముసిరిన ప్రధాన సందేహం.. సందిగ్ధం కూడా!
దీనిని కొంత లోతుగా పరిశీలిస్తే.. తప్ప సమాధానం లభించదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే .. ప్రస్తుతం ''మణిపూర్‌లో జరుగుతున్న, జరిగిన వివాదాలు.. మహిళలపై జరిగిన అమానవీయ ఘటనల అంశం .. పార్లమెంటును కుదిపేస్తోంది!.. వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి'' ఇదే.. అందరికీ తెలుసు. పైకి చూస్తే.. ఇదే కదా జరుగుతోంది.. నిజమే కదా! అనుకుంటారు. కానీ, దీనిని కొంత సూక్ష్మ దృష్టితో చూస్తే.. అసలు రాజకీయాలు అప్పుడు తెలుస్తాయని అంటున్నారు పరిశీలకులు.
ఎలాగంటే.. మణిపూర్‌లో జరిగిన అంశంపై చర్చించాలని.. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు కోరుతున్నా యి. సరే.. తొలి రెండు రోజుల్లో ఈ విషయంపై అధికార బీజేపీ ఆచితూచి అడుగులు వేసింది. దీనిపై మౌనంగా కూడా ఉంది. అనంతరం.. అనూహ్యంగా పరిణామాల్లో మార్పు కనిపించింది. ప్రతిపక్షాల కంటే కూడా బీజేపీనే ఉత్సాహం చూపించింది. ఎస్! చర్చకు మేం రెడీ అంటూ.. ప్రతిపక్షాలకు సమాచారం ఇచ్చింది. అంతేకాదు.. ప్రతిపక్ష సభ్యులు.. ఒక్కరు కూడా మిస్ కాకుండా.. సభకు రావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
మరి నిజానికి ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కోరుకున్నది ఇదే కాబట్టి.. చర్చకు రెడీ అయితే.. ఇక, పార్లమెం టు సజావుగానే కదా సాగుంతుంది. కానీ, ఈ పిలుపు ఇచ్చిన తర్వాత.. ఈ ఆహ్వానం పలికిన తర్వాత కూడా సభలు సజావుగా సాగలేదు.. సరికదా..మరింత గందరగోళానికి దారితీశాయి. దీనికి కారణం.. బీజేపీ వేసిన వ్యూహం.. దానికి చిక్కుకున్న విపక్షాలు! ఔను. నిజమే!! తొలి రెండు రోజుల్లో మణిపూర్ అంశంపై ఒకింత ఆత్మ విచారంలో పడిన బీజేపీకి.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన అంశాలు ఆయుధాలుగా మారాయి.
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అనేక చోట్ల అత్యాచారా లు.. మహిళలపై దాడులు జరిగాయి. ఆవెంటనే కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. ముందు.. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై చర్చిద్దాం.. ఈ లోగా మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేస్తారు! అంటూ.. ప్రకటించింది.
అంతే! ఇంకేముంది.. ఇప్పటి వరకు మణిపూర్‌పై విరుచుకుపడిన ప్రతిపక్షాలకు సౌండ్ లేకుండా పోయింది. అలాగని అవేవీ వదిలేయలేదు. ముందు మణిపూర్.. తర్వాత.. ఇతర రాష్ట్రాలు అంటూ రచ్చకు దిగాయి. దీంతో వర్షాకాల సభలు వాయిదాల సభలుగా మారిపోయాయి. ఇది కదా.. పొలిటికల్ చిత్రం అంటే అంటున్నారు పరిశీలకులు.