కేంద్రంలో కమల వికాసమే.. తాజా సర్వే ఎవరిదంటే?
ఇందులో 307 స్థానాల్లో విజయం సాధించటం ద్వారా మోడీ మాష్టారు మరోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.
మరో ఆర్నెల్ల వ్యవధిలో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి? దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మ్యాజిక్ ఎలా ఉండనుంది? ఆయన ప్రభుత్వ పాలన విషయంలో దేశ ప్రజల స్పందన ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు వీలుగా ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ సంస్థ తాజాగా సర్వేను విడుదల చేసింది. ఇందులో 307 స్థానాల్లో విజయం సాధించటం ద్వారా మోడీ మాష్టారు మరోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు మోడీ సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొంది.
మెజార్టీ మార్కును సలువుగా సాధిస్తుందని.. విపక్ష ఇండియా కూటమి తన ప్రభావాన్ని చూపలేదని తేల్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సలువుగా సాధిస్తుందని స్పష్టం చేసిన సర్వేలో మరిన్ని విషయాల్ని చూస్తే..
- ఎన్డీయే కూటమికి 307 స్థానాలు సొంతమవుతాయి. విపక్ష ఇండియా కూటమి 175 స్థానాలకే పరిమితం కానుంది. ఇతరులు 61స్థానాల్ని సొంతం.
- ఏపీలో అధికార వైసీపీ తన అధిక్యతను కాపాడుకుంటుంది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. 24-25 స్థానాలు ఆ పార్టీ వశమవుతాయని అంచనా వేసింది. ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సీటు మాత్రం దక్కే వీలుందని ఈ సర్వే తేల్చింది. స్కిల్ స్కాం ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే ఈ సర్వేను నిర్వహించినట్లుగా టైమ్స్ నౌ చెబుతోంది.
- 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం22 లోక్ సభ స్థానాల్ని గెలుపొందగా.. వచ్చే ఎన్నికల్లో మరో రెండు సీట్లు పెరగనున్నట్లుగా పేర్కొంది. మొత్తం 51.1 శాతం ఓట్లను దక్కించుకోవటం ఖాయమని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీకి 36.4 శాతం ఓట్లు లభిస్తాయని.. జనసేన ఒక్క స్థానంలో గెలిచే వీల్లేదని పేర్కొంది. ఆ పార్టీకి 10 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి ఏపీలో 1.3 శాతం ఓట్లు మాత్రమే పడతాయని లెక్క కట్టింది.
ఇక.. తెలంగాణ విషయానికి వస్తే 17 ఎంపీ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి 11 స్థానాల వరకు గెలిచే వీలుందన్న అంచనా వేసింది. బీజేపీకి 2-3, కాంగ్రెస్ 3-4 స్థానాల్లో విజయం సాధించే వీలుందని పేర్కొంది. 80 సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి 70-74 ఎంపీ స్థానాలు వచ్చే వీలుందన్న అంచనా కట్టింది. యూపీలో ఇండియా కూటమికి 4-8 సీట్లు.. బీఎస్పీకి ఒకటి.. ఇతరులకు మరొక సీటు లభించే వీలుందని అంచనా వేసింది.మరి.. ఇందులో వాస్తవం ఎంతన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వెయిట్ చేయక తప్పదు.