టీడీపీకి షాకిచ్చిన బీజేపీ నేత... జగన్ కు బిగ్ రిలీఫ్!
ఏపీ బీజేపీ నేతలకు చురకలంటించినంత పనిచేశారు! ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ అనూహ్యంగా "ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్" వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ! ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అని వైసీపీ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా.. పైగా ఈ చట్టానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ఈ చట్టం చాలా గొప్పదంటూ నాడు టీడీపీ నేతలు అసెంబ్లీలో ఇచ్చిన మద్దతుకు సంబంధించిన వీడియోలు చూపిస్తున్నా.. ఆ ప్రచారం మాత్రం ఆపడం లేదు! ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత బాబు & కో కి షాకిచ్చారు!
అవును... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల భూములు పోతాయంటూ గతకొన్ని రోజులుగా టీడీపీ గట్టిగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క స్వయంగా బీజేపీ నేతలే ఆ చట్టం తేవడం మా గొప్పతనం అని.. దానికి వచ్చే క్రెడిట్ అంతా తమకే దక్కాలన్న స్థాయిలో మాట్లాడుతుంటే... అదే బీజేపీతో జతకట్టిన టీడీపీ నేతలు మాత్రం ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని జగన్ పై విరుచుకుపడుతున్నారు.
దీంతో... ఈ విషయంపై ప్రజలకు చాలా మందికి క్లారిటీ ఉన్నప్పటికీ.. మరికొంతమంది మాత్రం చంద్రబాబు మాటలు నమ్మే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన వైసీపీలో ఉందని చెబుతున్నారు. దీంతో... ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొడుతున్నారు. ఈ సమయంలో వారికి బిగ్ రిలీఫ్ ఇస్తూ.. బీజేపీ సీనియర్ నేత బాబు & కో కి షాకిచ్చారు.. సంచలన రీతిలో స్పందించారు!
"మీ భూమి మీది కాదు" అనే నినాదంతో చంద్రబాబు పత్రికల్లో ఇచ్చిన భారీ భారీ ప్రకటనల కాపీని పోస్ట్ చేస్తూ... దానికి తనదైన స్పష్టమైన వివరణ ఇస్తూ.. వైసీపీ నేతలు చెబుతున్న విషయానికి మరింత బలం చేకూరుస్తూ... ఏపీ బీజేపీ నేతలకు చురకలంటించినంత పనిచేశారు! ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!
"ఈ ప్రకటనను ఇచ్చింది టీడీపీ తరఫునా లేక కూటమి తరఫునా? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?" అని ట్వీట్ చేశారు బీజేపీ సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు!
ఇలా... ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు.. చాలా స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ తమ పార్టీ జాతీయ నాయకత్వమని వెల్లడించారు. కేవలం అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వాల పని ఆయన తెలిపారు. ఈ ప్రకటనలకు ఏపీ బీజేపీ ఎలా బాధ్యత తీసుకుంటుందని కూడా ఆయన నిలదీయడంతో.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని పరోక్షంగా ప్రస్థావిస్తూ... నిద్రపోతున్నారా.. లేక మరేమైనా కారణం ఉందా అన్నట్లుగా ఆయన రియాక్ట్ అవ్వడం గమనార్హం!