బీజేపీ టాప్ 5 నేతలంతా ఒకే రోజు.. ఒకే రాష్ట్రంలో..
బీజేపీ జాతీయ నాయకత్వంలో ముఖ్యులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
సాధారణంగా జాతీయ పార్టీల నేతలు ఒకే రాష్ట్రంలో ఒకే రోజు ఉండడం చాలా అరుదు. అందులోనూ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఇలా జరగడం మరీ కష్టం. కానీ, తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం వాలిపోయింది. వీరందరూ కలిసి రాష్ట్రాన్ని చుట్టివచ్చారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఈ జాగ్రత్తను మధ్యలో పట్టువిడవకుండా కొనసాగించి ఉంటే బాగుండేది కదా? అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఐదుగురు..
బీజేపీ జాతీయ నాయకత్వంలో ముఖ్యులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆ తర్వాతి స్థానంలో పార్టీలో అత్యంత ముఖ్యులు కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బీఎల్ సంతోష్ ప్రత్యేకత గురించి గతేడాది ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సందర్భంగా కథలుకథలుగా చెప్పారు. ఇక ఐదో వ్యక్తి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీరంతా శనివారం తెలంగాణలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? కానీ, అది జరిగింది.
తలోదిక్కున..
ప్రధాని మోదీ శనివారం కామారెడ్డి, హైదరాబాద్ సమీప మహేశ్వరంలో సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. యోగి.. వేములవాడ, కాగజ్ నగర్ లో సభల్లో ప్రసంగించారు. హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. నడ్డా.. హుజూర్ నగర్, కోదాడ సభలకు హాజరయ్యారు. ఇక అమిత్ షా.. కొల్లాపూర్, పటాన్ చెరు బహిరంగ సభల్లో మాట్లాడారు. మునుగోడు, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలకు హాజరయ్యారు. బీఎల్ సంతోష్. రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ వ్యూహాలను పర్యవేక్షించారని చెబుతున్నారు.
ముందే జాగ్రత్తపడి ఉంటే..
బీజేపీ నిరుడు ఈ రోజుల వరకు తెలంగాణలో ప్రభావవంతమైన శక్తిగా కనిపించింది. మునుగోడులో ఓటమితో వెనుకబడింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి విమర్శలకు తావచ్చింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా చూపుతున్న అప్రమత్తత రాష్ట్ర నాయకత్వం మార్పుపై ఆలోచించి ఉంటే ఈ ఎన్నికల్లో మరింత మెరుగ్గా ఉండేదని.. వారు చెప్పినట్లు అధికారంలోకి వచ్చేయకపోయినా.. ఓట్ల శాతం పెరిగి ప్రబల శక్తిగా మారేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.