400 సీట్లు ఎందుకివ్వాలి? బీజేపీపై సామాజిక ఉద్యమాకారుల యుద్ధం!
''ఇప్పటి వరకు మీరు(ప్రజలు) చూసింది ట్రైల్ మాత్రమే.. అసలు కథ ముందుంది'' అని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్నసార్వత్రిక ఎన్నికల పోలింగ్(ఇప్పటి వరకు ఐదు దశలు జరిగాయి. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది) ప్రక్రియలో ఊరూ వాడా .. బీజేపీ నేతలు.. తమకు 400 సీట్లు రావాలని.. ఇవ్వాలని కూడా..ప్రచారం చేస్తున్నారు. ఇది వస్తే.. దేశ గతిని మార్చేస్తామని కూడా చెబుతున్నారు. ''ఇప్పటి వరకు మీరు(ప్రజలు) చూసింది ట్రైల్ మాత్రమే.. అసలు కథ ముందుంది'' అని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఇక, కేంద్ర మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా..ఇదే చెబుతున్నారు. తమకు 400 సీట్లు వస్తే.. పీవోకేను భారత్‌లో కలిపేస్తామని.. యూసీపీ(ఉమ్మడి పౌరస్మృతి )ని అమలు చేస్తామని అంటున్నారు.
మొత్తంగా చూస్తే.. తమకు 400 స్తానాలు కావాలని కమల నాథులు కోరుతున్నారు. ఇక, ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు.. ఇండియా కూటమి సభ్యులు కూడా ప్రస్తావిస్తూ.. ఇదే జరిగితే.. అంటే బీజేపీకి 400 స్థానాలు కట్టబెడితే.. రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, తద్వారా.. రిజర్వేషన్లుపోతాయని. ముస్లింలు పొరుగు దేశాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. వీరి ప్రచారంలో బీజేపీ దూకుడు ముందు ఇండియా కూటమి... కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నవి పెద్దగా ప్రజల మధ్యకు చేరడం లేదనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సామాజిక ఉద్యమకారులు.. రోడ్డెక్కారు. వీరిలో ప్రముఖులు మేధాపాట్కర్, అరుణ్ రాయ్ వంటి వారు కూడా ఉన్నారు.
400 సీట్లు బీజేపీకి ఎలా వస్తాయని..ఎందుకు వస్తాయని.. ఎందుకు ఇవ్వాలని వీరు ప్రశ్నల పరంపర ఎక్కు పెట్టారు. కొన్ని మీడియా చానెళ్లకు ఎన్నికలకు ముందుగానే వీరు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రచారం కాకుండా.. ప్రసారం కాకుండా కూడా.. తొక్కి పెట్టినట్టు తెలిసింది. అయితే.. వీటికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా వీటిలో రెండు కోణాలను ఉద్యమకారులు ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి బీజేపీ ప్రభుత్వంలో అడ్డుకట్ట పడిందని.. రచయితలు.. మేధావులను కూడా అణిచేశారని వీరు చెబుతున్నారు. ఇక, ధరలు.. సామాన్యులపై మోపిన భారాలను వీరు ప్రస్తావిస్తున్నారు.
వీటిని ప్రాతిపదికగా చేసుకుని.. గడిచిన ఎన్డీయే 10 ఏళ్లపాలనను కూడా.. వీరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో 12 మంది రచయితలు.. హత్యకు గురయ్యారని తెలిపారు. అదేవిధంగా ఉద్యమకారులైన.. వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా వంటి వారిని వందల మందిని అరెస్టు చేసి జైలు పాలు చేశారని చెబుతున్నారు. ఇందుకోసమేనా 400 సీట్లు ఇవ్వాలి ? అనేది వీరి ప్రశ్న. మరోవైపు.. సామాన్య జనాలపై ధరల భారం మోపారని చెబుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేవరకు మధ్య ప్రతిదీ జీఎస్టీతో ముడిపడిన విషయాన్ని ఎత్తి చూపారు. ఇందుకోసమేనా.. బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని నిలదీస్తున్నారు. అయితే.. వీరి విషయాలను.. వాదనలను ప్రధాన మీడియా స్రవంతులు ప్రసారం చేయకపోవడం గమనార్హం.