బీజేపీ గొప్పతనం ఏంటి...బాబు అండ్ పవన్ కదా విజయం ఇచ్చింది...!

అదేంటో తామే సొంతంగా గెలిచేసినంతగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Update: 2024-06-09 14:40 GMT

అదేంటో తామే సొంతంగా గెలిచేసినంతగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆనంద భాష్పాలు కారుస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఉన్న బలం ఏంటో అందరికీ తెలిసిందే. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి ఏపీలో టీడీపీ కూటమి సునామీ వచ్చినా బీజేపీ ఓట్ల శాతం రెండున్నర శాతం మించి పెరగలేదు అని లెక్కలు చెబుతున్నాయి.

అయితే బీజేపీ కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అంటే దానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎవరు కాదన్న ఇదే సత్యం. ఈ ఇద్దరికీ కలిపి పద్దెనిమిది మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుని అందులోకి బీజేపీని కూడా ఆహ్వానించి మూడు ఎంపీ సీట్లు గెలిపించిన ఘనత బాబు పవన్ లదే.

అలా నరసాపురం నుంచి శ్రీనివాసవర్మకు టికెట్ దక్కింది. ఆయన ఎంపీ అయ్యారు. ఇపుడు కేంద్ర మంత్రి అవుతున్నారు. ఆయన ఢిల్లీలో తనను కలసిన బీజేపీ నేతలతో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని పట్టుకుని ఆయన ఏడ్చేశారు. మీరంతా తనను నడిపించాలని ఏ తప్పులూ చేయకుండా చూడాలని శ్రీనివాస వర్మ సోముని పట్టుకుని ఏడుస్తూ అంటున్న మాటలు వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి.

దాంతో పాటు సోముకు పాదాభివందనం చేశారు. ఇక సోము సైతం ఆయన్ని ఓదారుస్తూ తాను కన్నీరు కార్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. శ్రీనివాసవర్మకు ఈ పదవి గౌరవం దక్కడం వెనక టీడీపీ జనసేన ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

అలాంటిది మధ్యలో బీజేపీ గొప్పతనం అన్నట్లుగా ఈ ఇద్దరు నేతలూ ఒకరిని ఒకరు పట్టుకుని కన్నీరు కార్చడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో బీజేపీని పైకి లేపిన ఘనత బాబుకు పవన్ కే దక్కుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే మొదటి నుంచి శ్రీనివాస వర్మ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. తనకు టికెట్ దక్కింది అన్నపుడూ ఆయన ఎమోషనల్ అయి పార్టీ ఆఫీసు వద్ద జెండాకు పాదాభివందనం చేశారు.

ఇపుడు అయితే సోముని పట్టుకుని ఏడ్చేస్తున్నారు. బీజేపీలో గత ముప్పై నాలుగేళ్ళుగా పనిచేస్తున్న వర్మ 2008 నుంచి 2014 వరకూ పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయనకు పదవి రావడం మంచిదే కానీ ఏదో ఇదంతా బీజేపీ గొప్పతనం అన్నట్లుగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టడం మీదనే అంతా తోచిన విధంగా రియాక్ట్ అవుతున్నారు.

Tags:    

Similar News