బీజేపీదే గెలుపు... జోస్యం చెప్పిన బీజేపీ శత్రువు !!
మరిఅలాంటి నాయకుడి నోటి వెంట వచ్చిన మాట ఏంటో తెలిస్తే.. కాంగ్రెస్ నేతలు.. తలుపులకు తాళాలు వేసుకుని మరీ ఆవేదన వ్యక్తం చేస్తారు.
బీజేపీ.. ఈ పదం పలికేందుకు కూడా ఇష్టపడని నాయకుడు, అసలు బీజేపీ అంటేనే కంపరం పుడుతోందని చెప్పే నాయకుడు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. బీజేపీకి పెద్దపులిలాగా మారిన ఆయన.. ఇప్పటికే ఇంటా, బయటా కూడా.. ఆ పార్టీపై తీవ్ర యుద్ధం చేస్తున్నారు. మరిఅలాంటి నాయకుడి నోటి వెంట వచ్చిన మాట ఏంటో తెలిస్తే.. కాంగ్రెస్ నేతలు.. తలుపులకు తాళాలు వేసుకుని మరీ ఆవేదన వ్యక్తం చేస్తారు. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ``ఈసారికి బీజేపీనే అధికారంలోకి రావొచ్చు. ఓడిపోక పోవచ్చు`` అని ఆయన ఢిల్లీ అసెంబ్లీ వేదికగా.. తేల్చి చెప్పారు.
శనివారం తాజాగా ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వంపై తనే.. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టుకున్నారు. 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమ్ ఆద్మీ అధికార పార్టీ సభ్యులు 54 మంది సభకు హాజరై.. వాయిస్ ఓటు రూపంలో కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ప్రభుత్వ విజయం దక్కించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రవిమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందన్న ఆయన.. 2029లో మాత్రం ఆ పార్టీని అధికారంలోకి రాకుండా కట్టడి చేస్తామని హెచ్చరించారు.
అంతేకాదు.. బీజేపీ ఈ దేశంలో ఎవరికీ భయపడడం లేదని చెప్పిన కేజ్రీవాల్.. కేవలం తమను చూసి మాత్రమే భయపడుతోంద ని.. ఢిల్లీ ప్రభుత్వాన్ని తెరచాటున ఉండి శాసించాలని చూస్తోందని విమర్శించారు. ``మా మంత్రులను అరెస్టు చేశారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.నన్ను అరెస్టు చేసి.. ఆప్‌ను అంతమొందించేలా చేయాలని చూస్తున్నారు. ఓకే.. నేను భయపడను. నన్ను అరెస్టు చేసుకోమనండి. కానీ, నా ఆలోచనలను, నా సిద్ధాంతాలను వారు.. కట్టడి చేయలేరు. ఇది వారికి సాధ్యమా?`` అని నిప్పులు చెరిగారు.
ఇక, విశ్వాస తీర్మానం ఎందుకు ప్రకటించాల్సివచ్చిందో కేజ్రీవాల్ చెప్పారు. ``బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు. వారికి టచ్‌లోకి వచ్చారు. కావాల్సినంత సొమ్ములు ఇస్తామని చెప్పారు. ఏదో రూపంలో మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. అందుకే.. మేం విశ్వాస పరీక్ష పెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి బీజేపీ నేతలు సిగ్గు పడాలి`` అని వ్యాఖ్యానించారు.