కేంద్రమంత్రికి వినూత్న అనుభవం... సరస్సుల్లో చిక్కుకున్న పడవ!
ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాకు వినూత్న అనుభవం ఎదురైంది.
ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాకు వినూత్న అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన పడవ సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. తొలుత మత్స్యకారుల వలలు అడ్డుపడి ఉంటుందని భావించినా.. తాము దారితప్పామనే విషయం తర్వాత తెలిసిందని రూపాలా వెల్లడించారు. ఈ ఘటన కలకలం రేపినా.. 2 గంటల తర్వాత ఎలాంటి నష్టం లేకుండా ముగిసింది!
అవును... ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా... స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హజరయ్యేందుకు చిలుకా సరస్సులో పడవలో బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న పడవ దారి తప్పడంతో ఆ సరస్సులోనే చిక్కుకుపోయింది. అయితే తొలుత మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు వేసిన వలలు అడ్డుపడి పడవ చిక్కుకుపోయిందని భావించారు.
అయితే తాము వెళ్లాల్సిన దారి తప్పడంతోనే సుమారు రెండు గంటలు ఆ సరస్సులోనే ఇరుక్కుపోయినట్లు కేంద్రమంత్రి బయటికి వచ్చిన తర్వాత వివరించారు. ఈ సమయంలో అధికారులు అప్రమత్తమై వెంటనే మరో పడవను పంపి కేంద్రమంత్రిసహా ఆయనతో ఉన్న బృందాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.
11వ విడత "సాగర్ పరిక్రమ" పథకంలో భాగంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాలా ఒడిశాలోని మత్స్యకారులతో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం కూడా ఆయన మత్స్యకారులతో భేటీ కావాల్సి ఉంది. దీనికోసం ఖోర్ధా జిల్లాలోని బర్కుల్ నుంచి పూరీలోని సాత్ పాడాకు చిలుకా సరస్సులోని ఓ పడవలో ఆయన, ఆయన సిబ్బంది, అధికారులు బయలుదేరారు.
అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి మరోశక్తి లేదని.. కేవలం పడవ నడిపే వ్యక్తికి ఆ మార్గం కొత్త కావడం, అదే సమయంలో అప్పటికే చీకటి కూడా పడటంతో దారి గుర్తించలేకపోయాడని కేంద్రమంత్రి సెక్యూరిటీ అధికారులు తర్వాత తెలిపారు. ఈ ఘటన సమయంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా కేంద్రమంత్రి పురుషోత్తంతో ఉన్నారు.