75 రోజులు మాత్రమే... బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే

Update: 2024-08-21 10:57 GMT

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో తాజాగా బొత్స ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషెన్ రాజు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స రాజధానితో పాటు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూటమి పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయని.. అయితే వాటి అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దాం అని బొత్స వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 75 రోజులు మాత్రమే అయ్యిందని.. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలని అన్నారు.

ఇక తాము ప్రజల గొంతుకగా సభలో వ్యవహరిస్తామని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ ను దేశానికి చాటి చెప్పామని అన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్షపడాల్సిందే అని ఈ సందర్భంగా బొత్స అభిప్రాయపడ్డారు. తప్పుడు కేసులు పెడితే పెట్టుకోనివ్వండని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంపై బొత్స స్పందించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తమ పార్టీది మూడు రాజధానుల విధానమే అని బొత్స క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ రాజధాని విషయంలో తమ విధానం మారితే వెల్లడిస్తామని అన్నారు. దీంతో... రాజధాని అంశంపై వైసీపీ స్టాండ్ ఇప్పటికీ అలానే ఉందని తెలుస్తోంది.

అంతక ముందు.. పార్టీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు బొత్స. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

Tags:    

Similar News