చంద్రయాన్ పై బ్రిటీష్ మీడియా భావదారిద్ర్యం.. వారికిచేతికానిది.. సాధించామనే

భారత్ లో పేదిరికం తాండవిస్తుండగానే.. అంతరిక్ష కార్యక్రమానికి (చంద్రయాన్3) పెద్దమొత్తంలో ఖర్చుచేయడం అవసరమా??

Update: 2023-08-24 12:00 GMT

చంద్రయాన్ -3 దిగ్విజయమైంది.. దేశదేశాల నుంచి భారత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఆఖరికి గతంలోనే చంద్రుడిపై ప్రయోగాలకు దిగిన అమెరికా, రష్యా కూడా భేష్ భారత్ అంటూ ప్రశంసిస్తున్నాయి. వారివారి మీడియాలూ కొనియాడుతున్నాయి. కానీ, ఒక దేశ మీడియాకు మాత్రం కడుపు మండిపోతోంది.. గురివింద గింజ మాటలతో డిబేట్లు పెడుతోంది. అసలు సందర్భం ఏమిటి..? తాను ప్రవర్తిస్తున్న తీరు ఏమిటి..? అనేది కూడా ఆలోచించడం లేదు.

పేదరికంలో ఉందట..?

"భారత్ లో పేదిరికం తాండవిస్తుండగానే.. అంతరిక్ష కార్యక్రమానికి (చంద్రయాన్3) పెద్దమొత్తంలో ఖర్చుచేయడం అవసరమా?? అంటూ బ్రిటీష్ మీడియా బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించింది. భారత్ లో పేదరికమే కాదు.. మౌలిక సదుపాయాల కొరత కూడా ఉందంటూ యాంకర్ చర్చలో మరింత నోరు పారేసుకున్నాడు. వర్థమాన దేశంగా భారత్ పెద్ద ఘనతను అందుకున్నప్పుడు.. ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ఇలా చేయాల్సిన అవసరం ఏమిటనే వాదన వస్తోంది. కాగా.. యాంకర్ ప్రశ్నలను చర్చలో పాల్గొన్న ఓ వ్యక్తి మరింత మండించాడు. భారత్ లో ఇఫ్పుడే కాదు 30-40 ఏళ్లుగా ఇవే పరిస్థితులు ఉన్నాయంటూ సమాధానం ఇచ్చాడు.

బ్రిటీష్ వారిది గురివింద నైజం.

పేదరికంలో ఉన్న భారత్ .. అంతరిక్ష కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున ఎందుకు ఖర్చు చేస్తోందని ప్రశ్నిస్తున్న బ్రిటీష్ మీడియా.. తమ దేశం బ్రిటన్ ఏంచేస్తున్నదో ఓసారి గమనించాల్సింది. బ్రిటన్ ప్రస్తుతం అంతరిక్ష ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ నెల ప్రారంభంలో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించి విఫలమైంది. తాము ఉపగ్రహాన్నే విజయవంతంగా ప్రయోగించలేని చోట భారత్ చంద్రుడి మీదకు వెళ్లడం వల్ల వచ్చిన కడుపు మంటే ఏడుపునకు కారణమైందేమో..?

ఆర్థిక వ్యవస్థలో వారిని పడగొట్టాం..

భారత్ లోని పేదరికం గురించి ఏడుస్తున్న బ్రిటీష్ మీడియాకు.. ఇటీవలే మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న సంగతి గుర్తులేదేమో? త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ అవతరించనున్న నిజం తెలియలేదేమో? కాగా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మనం ఇప్పటికే అధిగమించాం. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ దే స్థానం. బ్రిటన్ మన తర్వాత ఆరో ప్లేస్ కు పడిపోయింది. ఇదే సమయంలో అంతరిక్ష కార్యక్రమాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ఇస్రోకు విజయాల రేటు ఎక్కువ. ఈ విషయంలోనే కాక ఇస్రో భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందింది.

బ్రిటన్ కూడా పేదరికంలోనే..

చంద్రయాన్-3 విజయవంతంతో దుగ్ధ పెంచుకున్న బ్రిటన్.. భారత దేశంలోని పేదరికాన్ని ప్రస్తావిస్తూ కడుపు మంట చల్లార్చుకునే ప్రయత్నం చేసింది. కానీ బ్రిటీష్ మీడియాకు.. పేదరికం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉందని తెలియాల్సిన అవసరం ఉంది. అంతెందుకు బ్రిటన్ లో 2020-21 నాటికి దాదాపు 13.4 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని అధికారిక సమాచారం. అంటే అక్కడి జనాభా ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదలే.

పాలించి.. పీడించి..

బ్రిటిష్ మీడియాది గురువింద తీరనడానికి తాజా ఏడుపే కాదు.. ఇంకెన్నో ఉదాహరణలున్నాయి.. అసలు భారత దేశం ఈ స్థితిలో ఉండేందుకు కారణం ఎవరంటే.. ఠక్కున వచ్చే సమాధానం బ్రిటిషర్ల పాలనే కదా? 200 ఏళ్ల పాటు మన దేశాన్ని పీడించి పాలించిన ఆ దేశమే ఇప్పుడు సుద్దులు చెబుతుంటే ఏమనాలో అర్థంకాని పరిస్థితి..

ఆనంద్ మహీంద్రా దీటైన కౌంటర్

బ్రిటిష్ మీడియా తీరును సరిగ్గా ఎండగట్టారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. వారి అహంభావాన్ని కిందకు దించేలా.. "అసలు పేదరికం అంటే.. ఆశయ పేదరికం" అంటూ కడిగిపారేశారు. ఇక్కడ బ్రిటిష్ వారి భావ దారిద్ర్యాన్ని ఎండగడుతూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ కు నెటిజన్లు సాహో అంటున్నారు.

Tags:    

Similar News