ఎన్టీఆర్ ను ఓడించిన నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ముసలం
ఆ నియోజకవర్గం పేరు 35 ఏళ్ల కిందటే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది
ఆ నియోజకవర్గం పేరు 35 ఏళ్ల కిందటే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడే అక్కడ ఓడిపోయారు. ఆయన కూడా మామూలు నాయకుడు కాదు.. ఓ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి. జాతీయ స్థాయి రాజకీయాలను శాసించిన నేత. కానీ, అలాంటాయనే అక్కడ పరాజయం పాలయ్యారు. మరో విశేషం ఏమంటే.. అక్కడినుంచి గెలిచిన మరో నాయకుడు జాతీయ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలకంగా నిలిచారు.
మారుమూలన కానీ.. సంచలనం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండేది. భూముల విలువ పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రగతి పథంలో ఉంది. ఓ 20 ఏళ్ల కిందట కల్వకుర్తి పూర్తిగా వెనుకబడి ఉండేది. తెలంగాణలోని వెనుకడిన జిల్లాగా మహబూబ్ నగర్ కు పేరుంటే అందులోనూ కల్వకుర్తి మరింత వెనుకబడి ఉండేది. అలాంటిచోట నుంచి 1989లో దివంగత సీఎం, మహా నటుడు నందమూరి తారక రామారావు పోటీ చేశారు. అప్పటికి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న ఆయన కచ్చితంగా గెలుస్తారనే అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా జె.చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1985 ఉప ఎన్నికలోనూ చిత్తరంజన్ దాస్ గెలుపొందారు. 1989లో ఎన్టీఆర్ పై గెలుపు అనంతరం చిత్తరంజన్ కు జెయింట్ కిల్లర్ గా పేరొచ్చింది.
ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలోనూ స్థానం దక్కింది. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ ఓటమి చేజేతులా చేసుకున్నదే. ఎప్పుడూ నోరు జారని.. ఎదుటివారి పట్ల గౌరవంగా మాట్లాడే ఎన్టీఆర్.. కల్వకుర్తిలో తన ప్రతినిధిగా ఎవరిని నిలిపినా గెలుస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే ఆయన ఓటమికి కారణమైందని చెబుతారు. అయితే, ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ మరోచోట నుంచి గెలుపొందడం, పార్టీ కూడా ఓడిపోవడంతో పెద్ద సమస్య రాలేదు.
జైపాల్ రెడ్డి.. జైపాల్ యాదవ్
కల్వకుర్తి మరో ప్రత్యేకత ఏమంటే.. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఆయన మూడుసార్లు వరుసగా గెలిచారు. 1972లో కాంగ్రెస్, 1978, 1983లో జనతా పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేంద్ర మంత్రిగా చాలాకాలం పనిచేశారు. ఇక ఇదే కల్వకుర్తి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు జైపాల్ యాదవ్. 1999, 2009, 2018లో గెలుపొందారు. అంటే ఒకసారి గెలుపొంది ఓసారి ఓడిపోయారు. కాగా, జైపాల్ యాదవ్ పై అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది.
ఆయన వద్దంటే వద్దు
జైపాల్ యాదవ్ బీసీ నాయకుడు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోకి మారి పోటీ చేసి గెలిచారు. కానీ, ఇప్పుడు తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనను మార్చాలనేది ప్రత్యర్థి వర్గం డిమాండ్. వీరంతా కందుకూరులోని ఓ ఫామ్ హౌజ్ లో భేటీ అయ్యారు. జైపాల్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఆయనను కచ్చితంగా ఓడిస్తామని తేల్చిచెబుతున్నారు. అంతేగాక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి లేదంటే మరో బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్ఠానానికి తీర్మానం పంపాలని యోచిస్తున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కానీ.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
కొసమెరుపు..: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యతిరేక వర్గం నిర్వహించిన ఫామ్ హౌజ్ భేటీలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కూడా పాల్లొన్నారు. 1989లో ఎన్టీఆర్ ను ఓడించిన తర్వాత ఆయన మరెప్పుడూ గెలవలేదు. ఒకప్పటి జెయింట్ కిల్లర్ గా, బీసీ నాయకుడిగా గుర్తించి పలుసార్లు పదవులు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.